లొంగే ప్రసక్తే లేదు

Follow

- అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం తప్పదు
- ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది
- దాడి చేసి తప్పించుకొని పారిపోయే శకం ముగిసింది
- నేరానికి పాల్పడిన యూదు పాలకులను కఠినంగా శిక్షిస్తాం
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
దుబాయ్, జూన్ 18: ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో లొంగిపోవాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ బుధవారం నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అమెరికా ఏ విధంగా జోక్యం చేసుకున్నా వారికి కోలుకోలేనంత నష్టం జరుగుతుందని ఇరాన్ ప్రభుత్వ టీవీలో ముందుగా రికార్డు చేసి ప్రసారం చేసిన ఓ వీడియోలో ఖమేనీ హెచ్చరించారు. గత శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ప్రజల ముందుకు ఖమేనీ రావడం ఇది రెండవసారి. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఖమేనీ ఘాటుగా స్పందించారు. ట్రంప్ చేసిన హెచ్చరికలను తోసిపుచ్చిన ఖమేనీ ఆయనవి అసందర్భ ప్రేలాపనలుగా అభివర్ణించారు.
‘ఇరాన్ గురించి, ఆ దేశ ప్రజల గురించి, దాని చరిత్ర గురించి తెలిసిన ఆలోచనాపరులెవరూ ఈ విధమైన హెచ్చరికల భాషను ఉపయోగించరు. ఎందుకంటే ఇరానియన్ దేశం ఎన్నటికీ లొంగే ప్రసక్తి లేదు’ అని ఖమేనీ స్పష్టం చేశారు. అమెరికా సైనిక జోక్యానికి పాల్పడితే వారికి తీరని నష్టం వాటిల్లుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. భారీ తప్పిదానికి పాల్పడిన ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని ఖమేనీ హెచ్చరించారు. దాడి చేసి తప్పించుకుని పారిపోయే యుగం ముగిసిపోయిందని, నేరానికి పాల్పడిన యూదు పాలకులను శిక్షిస్తామని ఆయన చెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులు సాగిస్తున్న వేళ అత్యంత సాహసోపేతంగా, సకాలంలో స్పందిస్తున్న ఇరానియన్ జాతిని ఆయన ప్రశంసించారు. తమపై బలవంతంగా రుద్దిన యుద్ధాన్ని, అశాంతిని ఇరానియన్ జాతి ధైర్యంగా ఎదుర్కొంటుందని, ఎవరికీ లొంగే ప్రసక్తి లేదని ఖమేనీ ప్రకటించారు.
ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో లొంగిపోవాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ బుధవారం నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అమెరికా ఏ విధంగా జోక్యం చేసుకున్నా వారికి కోలుకోలేనంత నష్టం జరుగుతుందని ఇరాన్ ప్రభుత్వ టీవీలో ముందుగా రికార్డు చేసి ప్రసారం చేసిన ఓ వీడియోలో ఖమేనీ హెచ్చరించారు.