వందపడకలపై నిర్లక్ష్యమేలా?.. చెన్నూర్‌లో అర్ధాంతరంగా నిలిచిపోయిన దవాఖాన భవన నిర్మాణం

Follow

- బీఆర్‌ఎస్ సర్కారులో రూ.32 కోట్లతో శంకుస్థాపన
- కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులకు బ్రేక్
- పట్టించుకోని మంత్రి వివేక్ వెంకటస్వామి
- అందుబాటులోకి వస్తే నిరుపేదలకు అన్ని రకాల సేవలు
మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ చెన్నూర్, జూన్ 30 : చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న వందపడకాల దవాఖాన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యమందించే లక్ష్యంతో కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ హాస్పిటల్‌ను మంజూరు చేయించగా, ప్రస్తుత ప్రభుత్వ పట్టింపులేని తనంతో పనులకు బ్రేక్ పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ. 32 కోట్లు మంజూరు
బీఆర్‌ఎస్ సర్కారులో అప్పటి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెన్నూర్‌కు వంద పడకల దవాఖానను మంజూరు చేయించారు. ఇందుకోసం అప్పటి సీఎం కేసీఆర్ రూ. 32కోట్లు మంజూరు చేశారు. పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన స్థలం కేటాయించడంతో 2023 మార్చి 15న అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కంట్రాక్టర్ గత శాసనసభ ఎన్నికల వరకు శరవేగంగా పనులు చేపట్టారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవన నిర్మాణాలపై పట్టింపు కరువైంది. కొన్ని రోజుల తర్వాత పూర్తిగా పనులు నిలిచి పోయాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి హాస్పిటల్ నిర్మాణంపై కనీసం నోరు మెదకపకపోవడంపై ఈ ప్రాంత ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది.
బీఆర్‌ఎస్ హయాంలో చకాచకా..
బీఆర్‌ఎస్ హయాంలో వంద పడకల దవాఖాన నిర్మాణం చకాచకా సాగింది. త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మెరగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టుదలతో పనులను శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించడంతో పాటు పనులను పరిశీలించేవారు. అంతేకాకుండా సంబంధిత కాంట్రాక్టర్‌కు ఏమైనా ఇబ్బందులుంటే అప్పటికప్పుడు పరిష్కరించేవారు. దీంతో బీఆర్‌ఎస్ హయాంలో పనులు శరవేగంగా సాగి దాదాపు 80 శాతం పూర్తయ్యింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కొన్ని రోజుల పాటు పనులు నత్తనడకన సాగి, ఆపై మొత్తానికి నిలిచిపోయాయి. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన విధంగా పనులు జరిగి ఉంటే ఇప్పటి వరకు మిగిలిన 20 శాతం పనులు పూర్తయి వంద పడకల దవాఖాన ప్రజలకు అందుబాటులోకి వచ్చేది.
కాంగ్రెస్ సర్కారులో మంజూరైన మంచిర్యాల దవాఖాన పనులు ఎమ్మెల్యే పీఎస్సార్ చొరవతో శరవేగంగా సాగుతుండగా, చెన్నూర్‌లో మాత్రం ఇక్కడి ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి పట్టింపులేని కారణంగానే పనులు నిలిచి పోయాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఉన్న వాటికి తోడు కొత్తగా పలు అభివృద్ధి పనులు నియోజకవర్గానికి తీసుక రావాల్సి ఉండగా, ప్రస్తుతం కొనసాగుతన్న అభివృద్ధి పనులను కూడా మంత్రి వివేక్ పట్టించు కోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పందించి త్వరలో వంద పడకల దవాఖాన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
అందుబాటులోకి వస్తే పేదలకు మేలు
చెన్నూర్‌లో నిర్మిస్తున్న వంద పడకల దవాఖాన అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలతో పాటు మహరాష్ట్రలోని సిరోంచా తాలూకా వాసులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. ఈ దవాఖాన ఏర్పాటుతో అన్ని రకాల జబ్బులకు సంబంధించిన వైద్య నిపుణులు రానున్నారు. అంతేకాకుండా అన్ని రకాల వైద్య పరికరాలతో పాటు అవసరమైన సిబ్బంది ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. సిటీస్కాన్, ఎక్స్‌రే మిషన్‌లాంటి సౌకర్యాలతో పాటు న్యూరో సర్జన్ వైద్యుడు అందుబాటులో ఉంటారు. దీంతో ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న వందపడకాల దవాఖాన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.