వాన జాడేది ?.. ఆకాశంవైపు ఆశగా చూస్తున్న అన్నదాతలు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Farmers
  • ఇప్పటికే పలుచోట్ల విత్తనాలు విత్తి నష్టపోయిన రైతులు
  • ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్న వరుణుడు
  • మృగశిరలోనూ దంచికొడుతున్న ఎండలు
  • నేటివరకు ‘ఖమ్మం’లో 47 వేల ఎకరాల్లో సాగు పనులు

ఖమ్మం రూరల్‌, జూన్‌ 18 : సీజన్‌ ప్రారంభమై పక్షం రోజులు దాటినప్పటికీ ఈ ఏడాది వాన జాడ కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు, విత్తనాలు తెచ్చి పెట్టుకున్న అన్నదాతలు వాన కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ వానకాలం నైరుతీ రుతుపవనాలు మే నెల చివరిలోనే రాష్ర్టాన్ని తాకాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం తథ్యమని వాతావరణ శాఖ గత రెండు నెలల ముందుగానే ప్రకటన చేసింది. గతంలో కురవనన్ని వర్షాలు కురుస్తాయని కొందరు అధికారులు సైతం అనేకమార్లు ప్రకటించారు. దీంతో అన్నదాతలు పులకరించిపోయారు.

వ్యవసాయ పనులు ముందస్తుగానే ప్రారంభించుకోవచ్చని సంబురపడ్డారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ.. పరిస్థితి మాత్రం అనుకున్నదానికి విరుద్ధంగా కనిపిస్తున్నది. పైగా ఎండాకాలం కొట్టినట్టే ఎండలు దంచికొడుతున్నాయి. మృగశిర కార్తె ముగింపునకు వచ్చినా రుతుపవనాల జాడ కరువైంది. దీంతో అన్నదాతలు వర్షాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. వరుణుడు కరుణించకపోవడంతో కలవరపడుతున్నారు.

ఈ ఏడాది వానకాలం సీజన్‌లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలకు సంబంధించి వేల ఎకరాల్లో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. గడిచిన ఏడాది భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఆ లోటును పూడ్చుకునేందుకు జిల్లా రైతాంగం ఎంతో ఉత్సాహంగా సాగుకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు నైరుతీ రుతుపవనాలు ముందస్తుగా రావడం, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రకటించడంతో పదిరోజుల ముందుగానే వ్యవసాయ పనులు ప్రారంభించారు.

మే నెల ఆరంభంలోనే వాణిజ్య, అపరాల సాగుకు దుక్కులు దున్నుకున్నారు. రుతుపవనాల రాక ప్రారంభంలో ఓ మోస్తారు వర్షాలు పడడంతో ఇదే అదునుగా భావించి పత్తి విత్తనాలను సైతం విత్తుకున్నారు. మరికొందరు వరి సాగుకు సంబంధించి నారుమడులను సైతం సిద్ధం చేసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా నేటివరకు జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం వరి సాగు (వెదజల్లే పద్ధతి) 750 ఎకరాలు, మక్క సాగు విస్తీర్ణం 25 ఎకరాలు, పెసర 1,351 ఎకరాలు, పత్తి 23,236 ఎకరాలు, జనుము 450 ఎకరాలు, పిల్లిపెసర 10 ఎకరాలు, జీలుగ 24,538 ఎకరాలతోపాటు మరో 7,191 ఎకరాల సాగు విస్తీర్ణంలో వరి నారుమళ్లు పోసుకున్నారు. మొత్తంగా 47,551 ఎకరాల్లో సాగు పూర్తయ్యింది.

గడిచిన రెండు, మూడు రోజుల్లో మరో 20 ఎకరాల్లో రైతులు విత్తనాలను విత్తుకున్నారు. దీంతో సదరు రైతులు పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరు బావులు, ఇతర నీటి వనరుల సహాయంతో తడికట్టి బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విత్తిన పొలాల్లో సగానికి సగం మొక్కలు చనిపోవడంతో వాటి స్థానంలో కొత్త విత్తనాలను నాటుకుంటున్నారు.

వర్షాలు రాకుంటే అంతా నష్టమే..

ఆవిటి మొదట్లో వానలు రావడంతో అప్పటికే దుక్కి చేసుకొని ఉన్న పొలంలో పత్తి విత్తనాలు నాటుకున్నాం. నాలుగు ఎకరాల్లో విత్తనాలు వేసి పదిహేనురోజులు అవుతున్నది. వానలు కురువకపోవడంతో సగానికి సగం విత్తనాలు మొలకెత్తలేదు. ఇప్పటికే రూ.25 వేలు పెట్టుబడి పెట్టాను. మరో రెండు ప్యాకెట్లు కొని మొలకెత్తని విత్తనాల వాటి స్థానంలో మళ్లీ పెట్టాం. ఇప్పుడు వాటిని బతికించుకునేందుకు మూడు రోజులుగా వరుస తడులు కడుతున్నాను. వరుణ దేవుడి కటాక్షం ఉంటేనే బయటపడతాం. లేదంటే మరింత నష్టం తప్పదు.

– అంగిరేకుల వెంకన్న, రైతు, ముత్తగూడెం, ఖమ్మం రూరల్‌

​సీజన్‌ ప్రారంభమై పక్షం రోజులు దాటినప్పటికీ ఈ ఏడాది వాన జాడ కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు, విత్తనాలు తెచ్చి పెట్టుకున్న అన్నదాతలు వాన కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ వానకాలం నైరుతీ రుతుపవనాలు మే నెల చివరిలోనే రాష్ర్టాన్ని తాకాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *