వైద్యో నారాయణో హరి.. కనిపించే దేవుళ్లు.. వైద్యులు

Follow

- రోగుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా సేవలు
- నేడు వరల్డ్ డాక్టర్స్ డే
విద్యానగర్, జూన్ 30 : తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన పెద్దలు వైద్యో నారయణోహరి అన్నారు. అన్ని వృత్తుల్లోకెల్లా వైద్యవృత్తి పరమ పవిత్రమైనది. సమాజంలో వైద్యుల పాత్ర చాలా కీలకమైనది. విపత్కర పరిస్థితుల్లో కూడా వారు అందించే సేవలు అమోఘమైనవి. గతంలో అనేక వ్యాధులు, రోగాల బారి నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించారు. మన కండ్ల ముందే వీర విహారం చేసిన కరోనా వైరస్‌ను కూడా వైద్యలోకం సమర్ధవంతంగా ఎదుర్కొని మానవ జాతికి ఉపశమనం కలిగించారు. ఇలాంటి అనేక సందర్భాల్లో తమ సేవలందించి మానవ మనుగడను సురక్షితంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి సేవలను గుర్తు చేసుకొని గౌరవించేందుకు ఏటా జూలై 1న వరల్డ్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. వృత్తికే అంకితమై, కనిపించే దేవుళ్లుగా సేవలందిస్తున్న వైద్యులకు శుభాకాంక్షలు!
వైద్యులపై నమ్మకం ఉండాలి
రోగులకు వైద్యులపై నమ్మకం ఉండాలి. 24 గంటలూ రోగుల సేవలోనే ఉండే డాక్టర్లను నమ్మకపోతే ఎవరిని నమ్ముతారు. కానీ, అత్యవసర పరిస్థితుల్లో రోగి బంధువులు నానా హంగామా చేస్తారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు కరీంనగర్‌లోనే అన్నిరకాల వైద్య సేవలు, అత్యాధునిక వసతులతో పేదలకు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, ఫిజీషియన్
సామాన్యులకు అసమాన వైద్యం
నేను సింగరేణి కార్మికుడి కొడుకుగా జీవితాన్ని ప్రారంభించి తెలంగాణలోనే ఒక ప్రముఖ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్‌గా పేరుతెచ్చుకున్నా. సామాన్యులకు కూడా అసమాన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రెనె హాస్పిటల్‌ను ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యుత్తమ సేవలు అందిస్తున్నాం. అసాధారణ శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. మా తల్లి బంగారి లక్ష్మి పేరిట ప్రతి సంవత్సరం 15 మందికి పైగా పేదలకు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలను ఉచితంగా చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం దవాఖానలో ఆరోగ్య శ్రీ సేవలున్నాయి.
– బంగారి స్వామి, ఆర్థోపెడిక్
ప్రభుత్వ వైద్య సేవలు పెంచుతున్నాం
కరీంనగర్లో ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఏర్పడిన తర్వాత అన్ని విభాగాలు వచ్చి వైద్య సేవలు మెరుగు పడ్డాయి. దీంతో ఓపీ, ఐపీలతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. పూర్తి స్థాయిలో మందులతోపాటు వైద్యులు అందుబాటులోకి వచ్చారు. గతంలో నెలకు 200లోపు అయిన ప్రసవాలు ప్రస్తుతం నెలకు 800 దాటాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలకు ప్రోత్సాహకాలు అందించడంతో జిల్లాలో వందకు 80 శాతం ప్రభుత్వ దవాఖాపల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాలో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ గుండా వీరారెడ్డి, సూపరింటెండెంట్ (జీజీహెచ్ కరీంనగర్)
మంచి చేయాలనే తపిస్తారు
వైద్యులు రోగులకు మంచి చేయాలనే చూస్తారు. అన్నిసార్లు ప్రాణాలు కాపాడడం ఎవరివల్లా కాదు. కానీ, కొందరు ఈ మధ్యకాలంలో వైద్యులను బ్లాక్మెయిల్ చేయడం పరిపాటిగా మారింది. వైద్య వృత్తిపై ప్రజల్లో నమ్మకం పెరగాలి. ఇందుకు వైద్యులూ కృషిచేయాలి. ప్రజలు వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కావున అదే స్థాయిలో వైద్య సేవలందించాలి.
– చిట్టుమల్ల ప్రదీప్ కుమార్, జనరల్ సర్జన్
వైద్య వృత్తి గౌరవ ప్రదమైనది
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. ఆపదలో ఉన్న రోగులకు వైద్యులు ప్రాణాలు పోస్తారు. నేటి సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తున్నారు. ఈ గౌరవాన్ని నిలబెట్టుకునేలా వైద్యులు సేవలు అందించాలి. ఈ వృత్తి దేవుడు ఇచ్చిన వరంగా భావించాలి. ప్రజలకు సేవలు అందించినంత కాలం వైద్యులు చిరస్థాయిగా నిలుస్తారు. ఆధునిక ప్రపంచంలో వైద్య సేవల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా వైద్యులు కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ సులభ తరమైన వైద్య సేవలు అందించాలి.
– వెంకటేశ్ దాసరి, న్యూరో ఫిజీషియన్
నిస్వార్థంగా సేవలందిస్తున్నాం
నిరుపేదలకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ వైద్యులుగా ఉండి ఎందరో పేదలకు ప్రాణాలు పోయగలిగాం. ఈ వృత్తి నాకెంతో సంతృప్తిని ఇచ్చింది. వైద్యం ఖరీదైన నేటి రోజుల్లో కొందరు వైద్యులు డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా రోగుల ప్రాణాలు కాపాడబమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ జన్మకు ఇది చాలనిపించేలా సేవలు అందించా. అందిస్తున్నా.
– డాక్టర్ సుహాసిని, సీనియర్ గైనకాలజిస్ట్
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన పెద్దలు వైద్యో నారయణోహరి అన్నారు. అన్ని వృత్తుల్లోకెల్లా వైద్యవృత్తి పరమ పవిత్రమైనది.