వైద్య కళాశాలల్లో డిప్యుటేషన్లు రద్దు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
21
  • ఎన్‌ఎంసీ నోటీసుల ఎఫెక్ట్‌
  • ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు

హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వైద్య కళాశాలల్లో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 38 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల డిప్యూటేషన్‌ రద్దు చేశారు. డిప్యుటేషన్లు రద్దయిన మెడికల్‌ కాలేజీల్లో ఆదిలాబాద్‌ రిమ్స్‌, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌లు ఉన్నాయి. డిప్యుటేషన్లు రద్దయిన వారంతా వెంటనే తమ పాత స్థానాల్లో రిపోర్టు చేయాలని డీఎంఈ ఆదేశాలు జారీచేశారు. వీరితో పాటు మరో 20 మంది వరకు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ డిప్యుటేషన్లు సైతం రద్దు చేసినట్టు తెలిసింది.

త్వరగా ఫ్యాకల్టీని నియమించుకోవాలి..
ఢిల్లీలో బుధవారం ఎన్‌ఎంసీ అధికారుల విచారణకు రాష్ట్ర హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నరేంద్రకుమార్‌ హాజరయ్యారు. మెడికల్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులపై హెల్త్‌ సెక్రటరీ, డీఎంఈ ఇచ్చిన సమాచారంతో ఎన్‌ఎంసీ అధికారులు సంతృప్తి చెందినట్టు వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో కాలేజీలు ఏర్పాటుకావడం వల్ల ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు ఎన్‌ఎంసీకి వివరించారు. వీలైనంత త్వరగా ఫ్యాకల్టీని నియమించుకోవాలని, వసతులను మెరుగుపర్చుకోవాలని ఎన్‌ఎంసీ ఈ సందర్భంగా అధికారులకు సూచించింది. కాలేజీల పర్మిషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, సీట్ల కోత వంటి ఆలోచనే లేదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసినట్టు అధికారులు తెలిపారు.

వైసీపీ నేత భార్యకు రద్దు కానీ డిప్యుటేషన్‌
వైద్యారోగ్య శాఖ రద్దుచేసిన డిప్యుటేషన్లలో వైసీపీకి చెందిన ఏపీ కీలక నేత భార్య పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. సదరు డాక్టర్‌ పోస్టింగ్‌ జనగాం కాగా ఆమె ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె డిప్యుటేషన్‌ రద్దు కాకపోవడంపై డీఎంఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆ నేత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు.

​రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *