వ్యక్తిగత గోప్యత నా హక్కు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
04
  • సుప్రీం తీర్పులకు కట్టుబడి ఉన్నా
  • 2023లో వాడిన ఫోన్‌ ఇప్పుడు లేదు!
  • 2024లోనే పాత ఫోన్‌ను మార్చిన
  • ఫోన్‌ తప్ప ఇతర గ్యాడ్జెట్స్‌ వాడలేదు
  • ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ రికార్డులన్నీ రాష్ట్ర పురపాలక శాఖ వద్దే ఉన్నాయి
  • ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్‌ జవాబు
  • లేఖ అందిందన్న విచారణాధికారి

హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి ఉన్నానని, వ్యక్తిగత గోప్యత తన ప్రాథమిక హక్కు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి స్పష్టంచేశారు. ఫార్ములా-ఈ రేసు కేసులో మొబైల్‌ఫోన్‌ స్వాధీనం చేయాలని ఏసీబీ ఇచ్చిన నోటీసుకు బుధవారం కేటీఆర్‌ లేఖ ద్వారా సమాధానం పంపారు. విచారణకు ఫోన్‌ అడగడమనేది రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హకులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని తెలిపారు.

ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ పంపిన లేఖ మేరకు 16న ఏసీబీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరై అధికారులు అడిగిన అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. కేటీఆర్‌ లేఖ అందినట్టు దర్యాప్తు అధికారి ధ్రువీకరించారు. ఈ నెల 16న విచారణ పూర్తయిన తరువాత బీఎన్‌ఎస్‌ఎ సెక్షన్‌ 94 ప్రకారం ఏసీబీ తనకు మరో నోటీసును అందించిందని కేటీఆర్‌ తెలిపారు. అందులో తాను నవంబర్‌ 1, 2021 నుంచి డిసెంబర్‌ 1, 2023 వరకు వాడిన మొబైల్‌ ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, ఐపాడ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఏసీబీకి స్వాధీనం చేయాలని నోటీసులో కోరినట్టు పేర్కొన్నారు. అయితే, బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్‌ 94 కింద ఇచ్చిన నోటీసులో తాను వాడిన సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎందుకు స్వాధీనం చేయాలనే కారణం కానీ, ఉద్దేశం కానీ స్పష్టంగా పేరొనలేదని కేటీఆర్‌ ఎత్తిచూపారు.

రికార్డులన్నీ అక్కడే ఉన్నాయి..
ఫార్ములా-ఈ కేసు విచారణకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయని కేటీఆర్‌ స్పష్టంచేశారు. అవన్నీ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలని తెలిపారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల్లో గతంలో వాడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల ప్రస్తావన కానీ, సంబంధం కానీ లేనప్పటికీ, వాటిని స్వాధీనం చేయాలని కోరడం అంటే రాజ్యాంగం ఒక పౌరుడిగా తనకు కల్పించిన ప్రాథమిక హకులను హరించడమేనని పేరొన్నారు. కేసు దర్యాప్తు కోసం తాను వాడిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు అవసరమనే విషయాన్ని ఎకడా కూడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి
విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులను సేకరించాల్సి వస్తే.. సుప్రీంకోర్టు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో సేకరించే ఎలక్ట్రానిక్‌ వస్తువులను విచారణ సంస్థల అధికారులు ట్యాంపర్‌ చేయకుండా ఉండేందుకు కఠిన నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు పేరొన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. వ్యక్తిగత గోప్యతతోపాటు, విచారణ పేరుతో ఒక పౌరుడి నుంచి ఎందుకు తీసుకుంటున్నారు? అనే సరైన కారణం చెప్పకుండా, సేకరించిన సమాచారాన్ని ఆయనకే వ్యతిరేకంగా వాడడం సరైనది కాదు అనే ‘రైట్‌ అగైనెస్ట్‌ సెల్ఫ్‌-ఇన్‌క్రిమినేషన్‌’ అనేవి అత్యంత ముఖ్యమైనవని, వాటికి భంగం కలగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు సూచించిందని గుర్తుచేశారు.

2024లోనే ఫోన్‌ మార్చాను..
ఇదే అంశంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన పిటీషనర్‌కు సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన విషయాన్ని కేటీఆర్‌ తన లేఖలో ప్రస్తావించారు. ఆ కేసులో రెస్పాండెంట్‌గా ఉన్న ఈడీకి, పౌరుడి మొబైల్‌ ఫోన్‌ను వాడటంకానీ, అందులోని సమాచారాన్ని కాపీ చేయవద్దని కూడా స్పష్టంచేసిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. వివిధ దర్యాప్తు సంస్థలు విచారణలో భాగం చేసిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కేసులు అనేకం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేరొన్నారు. 2024 మొదటి త్రైమాసికంలో తాను మొబైల్‌ ఫోన్‌ను మార్చానని, తాను గతంలో వాడిన ఆ పాత ఫోన్‌ ఇప్పుడు తన దగ్గర లేదని కేటీఆర్‌ స్పష్టంచేశారు. తాను ఫోన్‌ కాకుండా ఏ ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను వాడలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.

​చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి ఉన్నానని, వ్యక్తిగత గోప్యత తన ప్రాథమిక హక్కు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి స్పష్టంచేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *