సబ్సిడీ యూరియా పక్కదారి.. వ్యవసాయ శాఖ తీరుపై అనుమానాలు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Illegal Transporting
  • ఖమానా హాకా సెంటర్‌లో డంపు చేయాల్సి ఉండగా.. ఫర్టిలైజర్స్‌ వాహనాల్లోకి ఎక్కించిన వ్యాపారులు
  • ఆదివారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న యువకులు
  • సమాచారమిచ్చినా స్పందించని అధికారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ) : “వాంకిడి టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఓ ఐచర్‌ వ్యాన్‌ ఆగింది. అంతలోనే అక్కడికి మూడు ఫర్టిలైజర్స్‌ దుకాణాలకు చెందిన వాహనాలు చేరుకున్నాయి. ఖమానా హాకా సెంటర్‌కు చేరవేయాల్సిన యూరియా బస్తాలను ఆ మూడు వాహనాల్లోకి ఎక్కించారు. ఈ విషయం తెలుసుకున్న వాంకిడికి చెందిన కొందరు యువకులు అక్కడికి చేరుకోగానే.. ఆ వాహనాలు వెళ్లిపోయాయి. దీంతో యువకులు వాటి కోసం వాంకిడిలో వెతకగా, ఓ వాహనం పట్టుబడింది. ఆ వాహన డ్రైవర్‌ దూకి పారిపోయాడు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు, విజిలెన్స్‌ అధికారులకు వారు ఫోన్‌ల ద్వారా సమాచారమందించారు. రాత్రి 10 గంటలైనా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఈ క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో హాకా నిర్వాహకుడు కొంత మంది రైతులతో వచ్చి ఆఫ్‌లైన్‌ బిల్లులు చూపించి ఆ యూరియాను తీసుకుపోయాడు.” రైతులకు అందాల్సిన సబ్సిడీ యూరియా పక్కదారి పడుతుందనడానికి ఈ ఘటనే చక్కని ఉదాహరణ. హాకా కేంద్రాలకు చేరాల్సిన సబ్సిడీ యూరియా.. నేరుగా ఫర్టిలైజర్స్‌ షాపులకు చేరవేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. రూ. 270కి ఇవ్వాల్సిన బస్తాను బ్లాక్‌లో రూ. 500 వరకూ విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల వద్ద డబ్బులు లేక ఉద్దెర తీసుకుంటే.. వాటిపై వడ్డీకూడా వేస్తున్నారు. జిల్లాలో ఇంత భారీ మొత్తంలో ఎరువుల అక్రమ రవాణా జరుగుతుండగా, అధికారులు తమకు ఫిర్యాదులు అందడం లేదనే సాకుతో చేతులెత్తేస్తున్నారు.

అక్రమ రవాణాపై చేతులెత్తేసిన అధికారులు

జిల్లాలో రైతులకు అందించాల్సిన సబ్సిడీ యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా.. యూరియా రవాణా వెనుక అధికారుల హస్తమున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. విత్తనాలు, ఎరువులు అమ్మకాలు ప్రారంభం కాకముందు తనిఖీలు చేస్తూ హడావుడి చేసిన వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు.. ప్రస్తుతం సాగు ఊపందుకున్న సమయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే ఇటీవల వాంకిడిలోని ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీచేశారు. సోమవారం రెబ్బెన మండలంలోని దుకాణాలను కూడా పరిశీలించారు. కానీ, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. దీని వెనుక ఆంతర్యమేమిటనేది అర్థం కావడం లేదు.

కలెక్టర్‌కు ఫిర్యాదు…

హాకా సెంటర్‌కు చేరాల్సిన సబ్సిడీ యూరియా.. అక్రమంగా ఫర్టిలైజర్‌ దుకాణాలకు చేరవేస్తూ పట్టుబడిన ఘటనపై బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలగతి సుచిత్‌ సోమవారం క లెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రేకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఘటనా స్థలానికి రాలేదని, దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న యూరియాను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రైతులకు సబ్సిడీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

​“వాంకిడి టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఓ ఐచర్‌ వ్యాన్‌ ఆగింది. అంతలోనే అక్కడికి మూడు ఫర్టిలైజర్స్‌ దుకాణాలకు చెందిన వాహనాలు చేరుకున్నాయి. ఖమానా హాకా సెంటర్‌కు చేరవేయాల్సిన యూరియా బస్తాలను ఆ మూడు వాహనాల్లోకి ఎక్కించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *