సున్నం చెరువుపై హైడ్రామా..!

Follow

- చెరువు విస్తీర్ణంపై వివాదం..
- హద్దుల నిర్ధారణ చేయకుండా కూల్చివేతలెలా?
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): సున్నం చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టిన హైడ్రా చర్యలు విమర్శనాత్మకంగా మారాయి. అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఈ సున్నం చెరువు వద్ద నివాసముంటున్నవారు తమను ఛాలెంజ్ చేయడాన్ని హైడ్రా అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తాము ఆరు చెరువుల అభివృద్ధి పనులు చేపట్టిన నేపథ్యంలో అన్నింటిని వదిలేసి సున్నంచెరువుపైనే దృష్టి పెట్టడం అదికూడా నెలరోజులుగా ఇదే పనిలో ఉండడంపై స్థానికులు మండిపడుతున్నారు.
అసలు బౌండరీలు ఫిక్స్ చేయకుండా కూల్చివేతలేంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సున్నంచెరువు విస్తీర్ణం విషయంలో ప్రభుత్వ శాఖల మధ్యే భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది వాస్తవం. ఈ విషయంలో అటు సంవత్సరం కిందటే ఏర్పాటైన హైడ్రా కమిషనర్‌కు పూర్తి అవగాహన లేదని, గతం నుంచి చెరువు విషయంలో రగడ జరుగుతూనే ఉందని స్థానికంగా ఉండే రిటైర్డ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు.
గతంలో ఇది కుంటగా ఉండేదని, సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే ప్రకారం ఈ చెరువు విస్తీర్ణం విషయంలో గుట్టలబేగంపేట కంటే బాలాపూర్ వైపే ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే గుట్టల బేగంపేటలో ఇది ఒక కుంట అని, దీనికి పై నుంచి సీవరేజ్ వాటర్ కూడా కలిసేదని, కాలక్రమేణా చెరువుగా మారిందని విస్తీర్ణం విషయంలో కూడా ఎవరూ సరిగా చెప్పలేరని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇప్పటివరకు చెరువు నిండి ఉంటే ఎఫ్‌టీఎల్ నిర్ధారించవచ్చు కానీ ఆ పరిస్థితులు ఎప్పుడూ ఏర్పడలేదని రిటైర్డ్ ఇంజినీర్లు అన్నారు.
విస్తీర్ణం తేలకుండా కూల్చివేతలు..
సున్నంచెరువు విస్తీర్ణమెంత అనే విషయంలో హైడ్రా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటివరకు సున్నం చెరువుకు హద్దుల నిర్ణయం జరగకపోవడంతో పాటు చెరువు విస్తీర్ణమెంతో తేలకుండానే కూల్చివేతలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సందర్భంలో ప్రభుత్వం తరపున నివేదిక ఇచ్చారు. ఇరిగేషన్ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 3778 చెరువులు ఉన్నట్లుగా గుర్తించామని, ఇందులో 2397 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని, 235 చెరువులకు డిసెంబర్ 2022 నాటికి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఇదే నివేదికలో సున్నంచెరువును సుదలవాని కుంటగా బాలాపూర్ మండలం అల్లాపూర్‌లో ఉన్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. ఈ చెరువు విస్తీర్ణం 15.23 ఎకరాలని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ మరోలా ఉంది. 1970లో సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో టోపోషీట్ ప్రకారం సున్నం చెరువు సరస్సు 26 ఎకరాలుగా పేర్కొన్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2016లో హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌లో కూడా సర్వే తర్వాత 32 ఎకరాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. చెరువు విషయంలో గుట్టలబేగంపేట, బాలాపూర్‌లో ఏ ప్రాంతాన్ని సున్నం చెరువు విస్తీర్ణం కింద తీసుకుంటున్నారో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు.
సున్నం చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టిన హైడ్రా చర్యలు విమర్శనాత్మకంగా మారాయి. అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఈ సున్నం చెరువు వద్ద నివాసముంటున్నవారు తమను ఛాలెంజ్ చేయడాన్ని హైడ్రా అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది.