హామీ ఘనం.. ఆచరణలో మోసం.. రిటైర్డ్‌ అంగన్‌వాడీ ఉద్యోగులకు సర్కారు షాక్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Anganwadi Employees
  • రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంపుపై ప్రభుత్వం మీనమేషాలు
  • నిరుడు జూలై నుంచి ఇస్తామని మాట మార్పు
  • ఈ ఏడాది జూలై నుంచే వర్తింపజేస్తామని ఉత్తర్వులు
  • బెనిఫిట్స్‌ కోసం ఏడాదిన్నరగా బాధితుల ఎదురుచూపులు

హైదరాబాద్‌, జూన్‌ 29 (నమస్తే తెలంగాణ) : అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్‌ ప్రయోజనాలు ఇస్తామని పార్లమెంటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. 2024 జూలై నుంచి విరమణ ప్రయోజనాలను ఇస్తామని పలుమార్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు 2025 జూలై నుంచి వర్తింపజేస్తూ ఇటీవల జీవో నంబర్‌ 8ను జారీచేసి ఏడాదిగా ఎదురుచూస్తున్న 10 వేలమంది ఆశలపై సిబ్బందిపై నీళ్లుజల్లింది. సర్కారు తీరుపై అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మండిపడుతున్నారు. జీవో నంబర్‌ 8ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రిటైరైన అంగన్‌వాడీ టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ. 50 వేల చొప్పున సర్వీస్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఈ బెనిఫిట్స్‌ను డబుల్‌ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి గద్దెనెక్కింది. గత ఏడాది కాలంలో దాదాపు 10 వేలమంది అంగన్‌వాడీ సిబ్బంది రిటైరయ్యారు. అయితే, తాజాగా సర్కారు జారీచేసిన జీవోతో వీరికి ప్రయోజనాలు అందకుండా పోయాయి.

కార్యాలయాల చుట్టూ చక్కర్లు

ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పలుమార్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి తప్పించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఉద్యోగం లేక, ఇటు సర్వీస్‌ బెనిఫిట్స్‌ అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్‌ 8ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సర్కారు దిగిరాకుంటే ఆందోళనకు దిగేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.

అప్‌గ్రేడ్‌ విషయంలోనూ అదే తీరు

మినీ అంగన్‌వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్‌ విషయంలోనూ ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని 3,989 మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చుతూ 2024 జనవరిలో జీవో జారీచేసింది. సిబ్బందికి మొదటి రెండు నెలలు పెరిగిన వేతనాలు ఇచ్చింది. తర్వాత మళ్లీ పూర్వపు వేతనాలు ఇస్తూ వచ్చింది. యూనియన్ల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం గత నెల 6న మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ తిరిగి ఉత్వర్వులు జారీచేసింది. తాజాగా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలోనూ ప్రభుత్వం ఇదేతీరున వ్యవహరిస్తున్నదని అంగన్‌వాడీ సిబ్బంది, యూనియన్ల నాయకులు మండిపడుతున్నారు.

జీవో నంబర్‌ 8ని సవరించాలి

ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష విరమణానంతర ప్రయోజనాలు ఇవ్వాలి. బెనిఫిట్స్‌ అందక 10 వేల మంది సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో నంబర్‌ 8ని సవరించాలి. లేదంటే ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

– ఆడెపు వరలక్ష్మి (మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు)

​అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్‌ ప్రయోజనాలు ఇస్తామని పార్లమెంటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *