‘హ్యామ్‌’ రోడ్లతో నషమే! రహదారుల పునరుద్ధరణపై దృష్టి పెట్టండి!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Road
  • రాష్ట్రంలో టోల్‌ వసూళ్లు సాధ్యం కావు
  • 60% నిధులు టోల్‌ ట్యాక్స్‌ ద్వారా రాబట్టలేం
  • 40% ప్రభుత్వ నిధులతో పనులు చేయొచ్చు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పునఃపరిశీలించండి
  • సీఎంకు బిల్డర్స్‌ అసోసియేషన్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 18(నమస్తే తెలంగాణ): రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదిత హైబ్రిడ్‌ యాన్యూటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రయోజనకరం కాదని, దీనివల్ల వేలాదిమంది ఉపాధి దెబ్బతింటుందని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ విభాగం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. 60% నిధులను టోల్‌ట్యాక్స్‌ ద్వారా రాబట్టడం సాధ్యంకాదని, ప్రభుత్వం ఖర్చు చేస్తామంటున్న 40% నిధులతోనే రోడ్లను నాణ్యం గా పునరుద్ధరించవచ్చని పేర్కొన్నది. హ్యామ్‌ విధానంపై పునఃపరిశీలన చేయాలని ముఖ్యమంత్రిని కోరుతూ.. అసోసియేషన్‌ మంగళవారం బహిరంగ లేఖను విడుదల చేసింది. ‘మీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దిశగా మీరు తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను మేము హర్షిస్తాం. అయితే, ముఖ్యంగా మీరు ప్రవేశపెట్టిన హ్యామ్‌ మాడల్‌పై ఒకసారి పునఃపరిశీలన చేయవలసిందిగా మా వినమ్ర మనవి. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సుమారు 120కిపైగా బ్యాచ్‌మిక్స్‌ ప్లాంట్లు ఏర్పాటుచేసిన విషయం మీకు తెలుసని భావిస్తున్నాం.

ప్రతి ప్లాంటులో ప్రత్యక్షంగా 50 నుంచి 100 మందికి, పరోక్షంగా 200 మందికిపైగా ఉపాధి లభిస్తున్నది. ఒకొక ప్లాంట్‌ ఏర్పాటుకు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు వెచ్చించిన నేపథ్యంలో ఈ వ్యవస్థలో పాల్గొంటున్న కాం ట్రాక్టర్లు, కార్మికుల ఉపాధికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల విస్తరణ కంటే, ప్రస్తుత రోడ్లను పునరుద్ధరించడంపై దృష్టి కేంద్రీకరించడమే సమంజసం. తద్వారా వాహనాల గమనానికి సరైన సౌకర్యం కలుగుతుంది. అంతేకాదు, నాణ్యతతో కూడిన పనులు జరుగుతాయి. ప్రతీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, అక్కడి రోడ్లను రెన్యువల్‌ చేసి, ఏడేండ్ల మెయింటెనెన్స్‌ కాంట్రాక్టుకు టెండర్లను పిలవవచ్చు.

ఈ విధానం ద్వారా కాంట్రాక్టర్లు క్వాలిటీ పనులు చేయగలుగుతారు. రెగ్యులర్‌ మాడల్‌తోనే ప్రభుత్వం హైబ్రిడ్‌ మాడల్‌లో ఖర్చు చేస్తామన్న 40% నిధులతోనే పనులు చేయవచ్చు. ప్రతిపాదిత ‘హ్యామ్‌’ మాడల్‌లో ప్రభుత్వం వరింగ్‌ పీరియడ్‌ (2.5 ఏండ్లు) నాటికి 40% ఖర్చు చేస్తుంది. మిగిలిన 60% టోల్‌ ద్వారా వసూలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అది మన రాష్ట్రంలో మాత్రం సాధ్యం కాదు. కాబట్టి ఈ విధానం ప్రయోజనకరం కాదు. ఉదాహరణకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)లో వరింగ్‌ పీరియడ్‌తోపాటు ఐదేండ్ల మెయింటెనెన్స్‌ను కలిపి టెండర్లు పిలుస్తున్నారు.

ఈ విధానం సుదీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగుతున్నది. అందుకే ముఖ్యమంత్రి గారికి మా మనవి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హ్యామ్‌ మాడల్‌ను పునఃసమీక్షించి, లోకల్‌ కాంట్రాక్టర్లు, ప్లాంట్లు, కార్మికుల జీవనోపాధిని కాపాడే విధంగా, ప్రభుత్వంపై భారం లేకుండా ఉండే విధంగా, ప్రస్తుతం ఉన్న విధానానికి మెయింటెనెన్స్‌ కాంట్రాక్టు పద్ధతిని జతచేసి కొనసాగించాలని కోరుతున్నాం’ అని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తమ లేఖలో సీఎంకు విజ్ఞప్తిచేసింది.

​రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదిత హైబ్రిడ్‌ యాన్యూటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రయోజనకరం కాదని, దీనివల్ల వేలాదిమంది ఉపాధి దెబ్బతింటుందని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ విభాగం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *