45 రోజుల్లో 31 మంది మృతి!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
04
  • రోజురోజుకూ పెరిగిపోతున్న అగ్నిప్రమాద మృతులు
  • సంగారెడ్డి ఘటనలో వెంటిలేటర్‌పైనే మరో 12 మంది
  • అడుగడుగునా కనిపిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం
  • పారిశ్రామిక కంపెనీల్లో అధికారుల తనిఖీలు శూన్యం
  • హజార్డ్‌ ఫైర్‌ ఫైటింగ్‌లో అగ్నిమాపకశాఖ వైఫల్యం
  • బాంబుల్లా పేలుతున్నరియాక్టర్లు.. భారీగా ప్రాణనష్టం

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ) : ఓవైపు సర్కారు వైఫల్యం.. మరోవైపు రియాక్టర్లు అణుబాంబుల్లా పేలుతున్నా కంపెనీల్లో ఫైర్‌ సేఫ్టీ తనిఖీల నిర్వహణలో ‘ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌’ వైఫల్యం.. దావానలంలా ఎగసిపడే భారీ హజార్డాస్‌ మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపకశాఖ అలసత్వం.. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్న కంపెనీలో ఫైర్‌ సేఫ్టీ పెట్టుకోకుండా యజమానుల నిర్లక్ష్యం.. వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కేవలం 45 రోజుల్లోనే రెండు ఘటనల్లో 31 మంది అగ్నికి ఆహుతి అయ్యారంటే, మరో 20 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ప్రతిపక్షాలపైనే దుమ్మెత్తిపోయడంలో నిమగ్నమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజల పాలనను గాలికొదిలిందనేందుకు ఇటీవల హైదరాబాద్‌లోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదం.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. చార్మినార్‌ వద్ద గుల్జార్‌ హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది చనిపోగా.. పాశమైలారం ప్రమాదంలో రియాక్టర్‌ పేలి 14 మంది మృత్యువాతపడ్డారు.

పారిశ్రామికవాడల్లో తనిఖీలేవి?
ప్రభుత్వ శాఖల అధికారులను పరుగులు పెట్టించడంలో, పారిశ్రామిక వాడల్లోని కర్మాగారాల్లో తనిఖీలు చేయించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇండస్ట్రీలు పెట్టే వరకూ ఇండస్ట్రీల విభాగం అనుమతులిస్తుంది. అవి స్థాపించిన తర్వాత వాటిల్లో బిజినెస్‌, ఫైర్‌ సేఫ్టీ ఇతర వ్యవహారాలన్నింటిపై ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ తనిఖీలు చేస్తుండాలి. వారితోపాటు అగ్నిమాపక వ్యవస్థ ఎలా ఉన్నది? అనేది కూడా స్థానిక అగ్నిమాపకశాఖ అధికారులు తరచుగా చెక్‌ చేస్తుండాలి. కానీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప.. తనిఖీలు చేయడం లేదని కార్మికులే అంటున్నారు. రియాక్టర్లను తరచూ చెక్‌ చేయాల్సిన బాధ్యత ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌కు ఉన్నా.. ఆ స్థాయిలో తనిఖీలు చేయడం లేదని చెప్తున్నారు. ఒక్క సంగారెడ్డి పరిధిలోని పలు పారిశ్రామిక వాడల్లో ఏడాదిన్నరగా పదుల సంఖ్యలో రియాక్టర్లు పేలిపోయాయి. ఆ ప్రమాదాల్లో సుమారు 10 మంది వరకూ కార్మికులు చనిపోయారు. సోమవారం నాటి దుర్ఘటనలో ఒక్కరోజే 14 మంది చనిపోవడం, పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలవడం పారిశ్రామిక వాడల్లో భద్రతను ప్రశ్నార్థకం చేసింది.

వందల సంఖ్యలో ఫైర్‌సేఫ్టీ లేని కర్మాగారాలు
సోమవారం పాశమైలారంలోని సిగాచి కర్మాగారంలో రియాక్టర్‌ పేలుడం వెనుక ఎలాంటి ఫైర్‌ సేఫ్టీ లేకపోవడమేనని పలువురు అగ్నిమాపకశాఖ అధికారులు చెప్తున్నారు. ఒక్క పాశమైలారం పారిశ్రామిక వాడలోనే సరైన ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థలు లేని కర్మాగారాలు సుమారు 500కు పైనే ఉన్నాయంటున్నారు. ఇక జీడిమెట్ల, రాజేంద్రనగర్‌ వంటి పారిశ్రామిక వాడల్లో వాటి సంఖ్య ఎక్కువగానే ఉన్నదని చెప్తున్నారు. ఫైర్‌ సేఫ్టీలేని వాటిల్లో పేలుళ్లు సంభవిస్తే.. హజార్డస్‌ ఫైర్‌ ఫైటింగ్‌ చాలా కష్టంగా మారుతుందని వివరిస్తున్నారు. ఒక్కసారిగా బ్రీతింగ్‌ కండీషన్‌ పడిపోతుందని, తీవ్రగాయాలతో దారుణంగా చనిపోవడం తప్ప.. మరోటి ఉండదని చెప్తున్నారు. కర్మాగారాల యజమానులు తప్పనిసరిగా ఫైర్‌ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని, అలా ఫైర్‌ సేఫ్టీ లేని కర్మాగారాలను ప్రభుత్వం తనిఖీలు చేయించి సీజ్‌ చేయాలని కోరుతున్నారు.

​ఓవైపు సర్కారు వైఫల్యం.. మరోవైపు రియాక్టర్లు అణుబాంబుల్లా పేలుతున్నా కంపెనీల్లో ఫైర్‌ సేఫ్టీ తనిఖీల నిర్వహణలో ‘ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌’ వైఫల్యం.. దావానలంలా ఎగసిపడే భారీ హజార్డాస్‌ మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపకశాఖ అలసత్వం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *