దేవాదుల గోదావరి బేసిన్‌లోనే ఉన్నదా?​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Cm Revanth
  • బనకచర్ల ఎక్కడున్నది?
  • ఏ బేసిన్‌ కిందకొస్తుంది?
  • నల్లమల.. తెలంగాణనా? రాయలసీమనా?
  • ఇవీ బనకచర్లపై ఎంపీల సమావేశంలో
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలు
  • ప్రాజెక్టులపై అవగాహనారాహిత్యం తేటతెల్లం
  • కనీస ప్రిపరేషన్‌ లేకుండానే కీలక సమావేశం
  • రాష్ట్ర నదులు, ప్రాజెక్టులు, అడవులపై సీఎం
  • అడిగిన ప్రశ్నలతో విస్తుపోయిన అధికారులు
  • సోషల్‌ మీడియాలో విమర్శలు.. లైవ్‌ నిలిపివేత
  • రేవంత్‌రెడ్డి నోట.. ‘మా కాళేశ్వరం’ మాట.!
  • మా కాళేశ్వరానికి అడ్డం పడ్తున్నరంటూ వ్యాఖ్య

హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్‌లోనే ఉన్నదా? బనకచర్ల ఎక్కడున్నది? ఏ బేసిన్‌ పరిధిలోకి వస్తుంది? ఏ నదులను అనుసంధానిస్తున్నారు? నల్లమల ఎక్కడున్నది? ఏపీ కింద ఉన్నదా.. తెలంగాణ కింద ఉన్నదా? ఇవీ అఖిలపక్ష సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలు. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టం, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు.

అయితే, అసలు ఈ ప్రాజెక్టు ఎక్కడున్నదో, ఏ నదిపై నిర్మిస్తున్నారనే విషయంపై తన అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టునేలా ప్రశ్నలు వేశారు. ఇంజినీర్లు, అధికారులు.. ఎంపీల బృందానికి బనకచర్లపై, రెండు రాష్ర్టాల్లోని పలు ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న సమయంలో సీఎం రేవంత్‌ పలు ప్రశ్నలు వేశారు. ‘బనకచర్ల ఏ బేసిన్‌పై (ఏ నదిపై) ఉన్నది?’ అని ప్రశ్నించారు.

అంతటితో ఆగకుండా ‘బనకచర్ల ప్రాజెక్టు లొకేషన్‌ ఎక్కడ?’ అని ఆరా తీశారు. ఈ విధంగా సీఎం ప్రశ్నించడంతో అక్కడున్న అధికారులు, ఇంజినీర్లు, ఎంపీలు అవాక్కయ్యారు. లోలోపల నవ్వుకున్నారు. ఆ మీటింగ్‌ జరుగుతున్నదే బనకచర్ల అంశంపై! అలాంటిది ఆ ప్రాజెక్టు ఎక్కడున్నదో, ఏ నదిపై ఉన్నదో తెలియకుండా సీఎం మీటింగ్‌కు వచ్చారా అంటూ సోషల్‌ మీడియా విమర్శలతో హోరెత్తిపోయింది. దీంతో ఆగమేఘాలపై మీటింగ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు నిలిపివేయాల్సి వచ్చింది.

ఒక్కసారైనా సమీక్షించారా?

బనకచర్లపై అధికారులతో ఒక్కసారి కూడా సీఎం సమీక్షించలేదనే అంశం తాజా అఖిలపక్ష మీటింగ్‌లో ఆయన అడిగిన ప్రశ్నలతో తేటతెల్లమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బనకచర్లపై కనీస అవగాహన లేని సీఎం రేవంత్‌రెడ్డి ఇక ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏం పోరాటం చేస్తారు? ఏవిధంగా అడ్డుకుంటారు? అనే ప్రశ్నలను నీటిపారుదలరంగ నిపుణులు సంధిస్తున్నారు. ఇక ప్రజెంటేషన్‌ ఇస్తున్న అధికారి సైతం బనకచర్ల ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో ఉన్నదని చెప్పడంతో అంతా నివ్వెరపోయారు. నిజానికి, బనకచర్ల ప్రాజెక్టును ఏపీలోని కర్నూల్‌ జిల్లా నంద్యాల సమీపంలో అక్కడి ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు పెన్నా బేసిన్‌పై ఉన్నది. నీళ్లను తొలుత గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు, అక్కడినుంచి బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్‌కు తరలించనున్నది.

నల్లమల ఏపీనా? తెలంగాణనా?

సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీలో నిర్మిస్తున్న బనకచర్లపైనే కాదు.. తెలంగాణలో ఉన్న దేవాదుల ప్రాజెక్టుపైనా అవగాహన లేకపోవడం గమనార్హం. ప్రజెంటేషన్‌ సందర్భంగా ‘దేవాదుల గోదావరి బేసిన్‌లోనే ఉన్నదా?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం ఆ ప్రశ్న అడగగానే సమావేశంలో ఉన్న పలువురు అధికారులు, ఎంపీలు ఆయన వైపు విస్మయంగా చూడటం గమనార్హం. సీఎం స్థాయిలో ఉండి రాష్ట్రంలోని ప్రాజెక్టు ఎక్కడున్నదో, ఏ నదిపై ఉన్నదో తెలియదా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక రేవంత్‌ పలు బహిరంగ సభల్లో … ‘నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చాను. క్రూరమృగాల మధ్య పెరిగాను’ అని చెప్తుంటారు. కానీ, బుధవారంనాటి ప్రజెంటేషన్‌ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి అతి పెద్ద డౌట్‌ వచ్చింది. ‘నల్లమల్ల ఏరియా తెలంగాణ కిందకు వస్తుందా? రాయలసీమ కిందకు వస్తుందా?’ అని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి నోట.. ‘మా కాళేశ్వరం’ మాట!

ఎంపీల అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతూ.. తెలంగాణలోని ‘మా సీతారామ ప్రాజెక్టుకు అడ్డంపడ్తరు. మా సమ్మక్కసాగర్‌కు అడ్డంపడ్తరు. మా కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంపడ్తరు’ అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌ నోటి వెంట ‘మా కాళేశ్వరం ప్రాజెక్టు’ అనే మాట రావడం గమనార్హం.

అదేవిధంగా తమ ప్రభుత్వం వచ్చాక ‘ఒక్క ప్రాజెక్టు అయినా ప్రారంభించింది ఉన్నదా?’ అని ప్రశ్నించారు. అంటే ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్‌ సర్కారు ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదనే అంశాన్ని సీఎం స్వయంగా ఒప్పుకున్నట్టయ్యింది. కొత్త ప్రాజెక్టులు కట్టేందుకు రూ.500 కోట్లు కూడా లేవని చెప్పారు. నిధులు లేకపోవడంతోనే ప్రాజెక్టులు పూర్తిచేయడం లేదని, కొత్త ప్రాజెక్టులు నిర్మించడం లేదని, అందుకే గోదావరి జలాలు కిందికి పోతున్నాయని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి నీళ్లలో తమ వాటా 968 టీఎంసీల నీళ్లు వాడుకునేలా బ్లాంకెట్‌ ఎన్‌వోసీ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన నీళ్లను వాడుకోవాలని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో తన పలుకుబడితో బనకచర్లను పూర్తి చేయాలనుకుంటున్నారని, అయితే, కేంద్రం అండ ఉంటే.. అన్ని అనుమతులు వస్తాయనుకుంటే.. అది జరగదని వ్యాఖ్యానించారు. బనకచర్లపై కేంద్రంతో సంప్రదింపుల తర్వాత కూడా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.

ఆంధ్ర ప్రజెంటేషనే..?

ఇక ఇక్కడ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చూస్తే అది ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్‌కు కాపీలా ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కనీసం మన ప్రభుత్వం మన వాదనలకు బలం చేకూర్చేలా ప్రజెంటేషన్‌ కూడా తయారు చేయలేదా? అనే విమర్శలొస్తున్నాయి. ఏపీ మిగులు జలాలు వాడుకుంటే తప్పేంది అన్నట్టుగానే ప్రజెంటేషన్‌ కొనసాగిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

ఘోష్‌ కమిషన్‌ లేఖ నిజమే: సీఎం

కాళేశ్వరంపై క్యాబినెట్‌కు సంబంధించిన మినిట్స్‌ను ఇవ్వాలని ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమేనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్‌ అనుమతి లేదని వ్యాఖ్యానించారు. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. అంచనాలు పెంచేందుకు మాత్రమే క్యాబినెట్‌కు వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీలోపు కమిషన్‌కు పూర్తి వివరాలను ప్రభు త్వం అందజేస్తుందని చెప్పారు.

​దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్‌లోనే ఉన్నదా? బనకచర్ల ఎక్కడున్నది? ఏ బేసిన్‌ పరిధిలోకి వస్తుంది? ఏ నదులను అనుసంధానిస్తున్నారు? నల్లమల ఎక్కడున్నది? ఏపీ కింద ఉన్నదా.. తెలంగాణ కింద ఉన్నదా? ఇవీ అఖిలపక్ష సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *