అన్నదాతలకు సంకెళ్లా?

Follow

- రేవంత్ రాక్షసత్వానికి ఇది పరాకాష్ట
- ‘ఇథనాల్’ బాధిత రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేటు
- ప్రజాస్వామ్య విలువలకు సర్కార్ పాతర
- రైతులకు సీఎం క్షమాపణ చెప్పాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు పోలీసులు బేడీలు వేయడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నదాతల చేతికి సంకెళ్లు వేసి అలంపూర్ కోర్టుకు తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తమ భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కొన్ని నెలల నుంచి శాంతియుతంగా పోరాడుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టి వారికి దొంగల మాదిరిగా బేడీలు వేసి ప్రజాస్వామ్య విలువలకు ఈ ప్రభుత్వం పాతర వేసిందని ఫైర్ అయ్యారు. గతంలో తన అల్లుడి ఫార్మా కంపెనీని అడ్డుకుంటున్నారన్న అకసుతో లగచర్ల రైతులపైనా ఇదే విధంగా రేవంత్‌రెడ్డి అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి కూడా కనికరం లేకుండా బేడీలు వేయించారని, ఆ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్రలో మచ్చగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఇప్పుడు పెద్ద ధన్వాడ రైతులను లక్ష్యంగా చేసుకొని పోలీసులతో హింసించడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నదని, రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి అన్నదాతల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు పోలీసులు బేడీలు వేయడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.