సిండికేట్‌ దోపిడీ​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Adilabad2
  • బ్రాండెడ్‌ పత్తి విత్తనాలను బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యాపారులు
  • కృత్రిమ కొరత సృష్టించి మరీ అమ్మకాలు
  • రూ. 850 ఉన్న ప్యాకెట్‌ను రూ. 1200 వరకు పెంచేసి దండుకుంటున్న వైనం
  • బిల్లులు ఇవ్వకుండా దబాయింపు
  • కన్నెత్తి చూడని అధికారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు. డిమాండ్‌ ఉన్న సీడ్స్‌ను కృత్రిమ కొరత సృష్టించి మరీ బ్లాక్‌లో విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. రూ. 850 అమ్మాల్సిన 475 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 1100 నుంచి రూ. 1200 వరకూ పెంచేసి అమ్ముతూ అందినకాడికి దండుకుంటున్నారు. నెల క్రితం వరకు ఫర్టిలైజర్స్‌ దుకాణాలను తనిఖీ చేసి హడావుడి చేసిన అధికారులు.. ప్రస్తుతం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయం..
జిల్లాలో ఈ వానకాలం సీజన్‌లో 3.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇందుకనుగుణంగా విత్తన ప్యాకెట్లు తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇక ఇదే అదనుగా భావించిన వ్యాపారులంతా కుమ్మక్కై తమ వద్ద ఉన్న బ్రాండెడ్‌ పత్తి విత్తనాల ప్యాకెట్లను ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతులు పత్తి విత్తనాల కోసం ఫర్టిలైజర్స్‌ షాపులకు పరుగులు పెడుతున్నారు.

ఈ ప్రాంత రైతులు తులసీ, మహికో, కిలాడి, సంకేత్‌, సూపర్‌కాట్‌, సీసీహెచ్‌ 999, ఈవీఎస్‌ వంటి విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనిని అవకాశంగా భావించిన వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు విక్రయిస్తున్నారు. రూ. 850 విలువ చేసే 450 గ్రామల పత్తి విత్తనాల ప్యాకెట్‌ను రూ. 1100 నుంచి రూ. 1200 వరకూ పెంచేసి అమ్ముతున్నారు. ఇక ఆర్థిక ఇబ్బందులతో ఉద్దెర తీసుకునే రైతుల వద్ద మరింత ఎక్కువ ధర తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

బిల్లులు ఇవ్వట్లేదు…
ఫర్టిలైజర్స్‌ వ్యాపారులు కుమ్మక్కై రెట్టింపు ధరలకు విక్రయిస్తుండగా, రైతులు గత్యంతరం లేక కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. బ్లాక్‌లో కొంటున్న పత్తి విత్తనాల ప్యాకెట్లకు వ్యాపారులు బిల్లులు, రసీదులు ఇవ్వడం లేదు. ఇష్టముంటే కొనండి.. లేకపతే పొండి అంటూ రైతులను దబాయిస్తున్నారు. విత్తనాలు దొరకవేమోనని ఆందోళనకు గురవతున్న రైతులు విత్తనాలు కొనకతప్పడం లేదు. ఈ విత్తనాలు నాటిన తర్వాత మొలవకపోయినా.. పెరగకపోయినా.. పూత.. కాయలు రాలిపోయి రైతులకు ఎలాంటి నష్టం వచ్చినా ప్రశ్నించే అవకాశం ఉండకుండా వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు.

నెల క్రితం వరకు హడావుడి..
నెల క్రితం వరకు ఫర్టిలైజర్స్‌ దుకాణాలు తనిఖీలు నిర్వహిస్తూ హడావుడి చేసిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి విత్తనాలను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తున్నాయి. వ్యాపారులతో కుమ్మక్కవ్వడం వల్లే తనిఖీలు చేపట్టకుండా స్తబ్ధుగా ఉంటున్నట్లు తెలుస్తున్నది.

​జిల్లాలోని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు. డిమాండ్‌ ఉన్న సీడ్స్‌ను కృత్రిమ కొరత సృష్టించి మరీ బ్లాక్‌లో విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *