వణుకుతున్న టెహ్రాన్‌​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
13
  • ప్రాణ భయంతో ప్రజల వలసలు
  • మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వైనం
  • వీధులు నిర్మానుష్యం.. దుకాణాలు మూసివేత

న్యూయార్క్‌, జూన్‌ 18: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. బాంబుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు సామాన్య పౌరులకు లేవు. దీంతో బాంబు దాడులకు భీతిల్లుతున్న టెహ్రాన్‌ పౌరులు మెట్రో స్టేషన్లలో నేలపైన పడుకుని బాంబుల మోతలు వింటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇరాన్‌లోని అణు కార్యక్రమాన్ని, సైనిక స్థావరాలను ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌ గగనతలం తమ అధీనంలోకి వచ్చిందని చేసిన ప్రకటనతో భయాందోళన చెందుతన్న టెహ్రాన్‌ ప్రజలు.. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఏ క్షణాన తమపైన బాంబుల వర్షం కురిపిస్తాయోనని ప్రాణాలు ఉగ్గబెట్టుకున్నారు. టెహ్రాన్‌లో నివసించే కోటి మంది ప్రజలు వెంటనే నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం హెచ్చరించడంతో వేలాది మంది ప్రజలు నగర శివార్ల వైపు పరుగులు తీశారు. కొందరైతే కాస్పియన్‌ సముద్రం వైపు మరికొందరైతే అర్మేనియా, తుర్కియేకు కూడా తరలిపోయారు. అయితే బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లలో నివసించే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు తమ ఆప్తుల వెంట వెళ్లలేకపోవడంతో అక్కడే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారని ఓ మానవ హక్కుల గ్రూపు పేర్కొంది.

స్థానిక మీడియా మూసివేత
బాంబు దాడులకు తామే లక్ష్యంగా మారిపోవడంతో స్థానిక మీడియా వార్తా సేకరణ, ప్రసారాన్ని నిలిపివేసింది. దీంతో బయట ఏం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో టెహ్రాన్‌ పౌరులు జీవిస్తున్నారు. వీధుల్లో కనిపించే పోలీసులు రక్షణ కవచాలు ధరిస్తుండగా సైరన్లు వినిపిస్తే తక్షణమే ఎలా స్పందించాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తన కుటుంబానికి లేదా స్నేహితులకు పంపే ప్రతి సందేశం ఇదే చివరిదవుతుందన్న భావన ఇటీవలి రోజుల్లో కలుగుతోందని 49 ఏళ్ల షిరిన్‌ తెలిపారు. రేపు తాము బతికి ఉంటామో లేదో తెలియడం లేదని ఆమె చెప్పారు.

ఇరాన్‌ సెంట్రీఫ్యూజ్‌ కేంద్రాలు ధ్వంసం
దుబాయ్‌, జూన్‌ 18: ఫ్యాక్టరీలపైన ఇజ్రాయెల్‌ మంగళవారం రాత్రి దాడులు జరిపి ధ్వంసం చేసిందని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) తెలిపింది. 50కిపైగా యుద్ధ విమానాలు ఈ దాడులలో పాల్గొన్నట్లు సంస్థ వెల్లడించింది. అణ్వస్ర్తాల కోసం ఇరాన్‌ యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ సెంట్రీఫ్యూజ్‌ ఉపయోగపడుతుందని ఇజ్రాయెలీ రక్షణ దళాలు(ఐడీఎఫ్‌) వెల్లడించాయి.

ఖమేనీ దాక్కుని ఉన్న బంకర్‌పై దాడి?
ఇరాన్‌ చీఫ్‌ ఆయతొల్లా ఖమేనీ దాక్కుని ఉన్న ఒక బంకర్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ఆయన టెహ్రాన్‌లోని లావిజన్‌ పొరుగు ప్రాంతంలో ఒక రహస్య బంకర్‌లో దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఇజ్రాయెల్‌ వైమానిక దళాలు బుధవారం ఈ దాడులు జరిపాయి. అయితే ఇజ్రాయెల్‌ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించ లేదు. ఇరాన్‌ కూడా ఈ వార్తలను ఖండించింది.

​ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. బాంబుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు సామాన్య పౌరులకు లేవు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *