ఎన్‌ఈపీ దేశానికే ప్రమాదకరం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– కేరళలో ఈ విధానాన్ని అమలు చేయం
– భవిష్యత్‌ తరాలను తప్పుదోవ పట్టిస్తోంది
– ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశానుసారమే దీనిని బీజేపీ అమలు చేస్తోంది
– ఆర్‌ఎస్‌ఎస్‌, జియోనిస్టులు కవలలు
– ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభ ముగింపు సందర్భంగా: బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
– విద్యార్థి శక్తి ముందు సంఘ్‌ పరివార్‌ లొంగిపోవాల్సిందే : ఆర్‌ అరుణ్‌కుమార్‌
కోజికోడ్‌ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

బీజేపీ నేతత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) దేశానికే ప్రమాదకరమనీ, అందుకే కేరళ ఈ విధానాన్ని అమలు చేయడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. ఎన్‌ఈపీ భవిష్యత్‌ తరాలను తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభ ముగింపు సందర్భంగా సోమవారం కోజికోడ్‌లోని బీచ్‌ ఫ్రీడమ్‌ స్క్వేర్‌ (కెవి సుధీష్‌ నగర్‌) మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేరళ సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానాన్ని కేరళ ఆమోదించడం లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరాలకు తప్పుడు సమాచారాన్ని అందించే ఎన్‌ఈపీ ”దేశానికి ప్రమాదం కలిగిస్తుంది” అని విమర్శించారు. కేంద్రం పాఠ్యపుస్తక సవరణను తమ ప్రభుత్వం అంగీకరించలేదనీ, తొలగించబడిన భాగాలను చేర్చామని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని ధ్వజమెత్తారు. మొత్తం విద్యారంగాన్ని కాషాయీకరించే ప్రయత్నం జరుగుతోందని, చరిత్రను వక్రీకరించి పాఠ్యాంశాలను మారుస్తున్నారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాల ప్రకారం బీజేపీ ప్రభుత్వం దేశ ఉనికిని ప్రమాదంలో పడేసే వైఖరి తీసుకుంటోందని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమనీ, భారత దేశ ఔనత్యాన్ని చాటి చెప్పే కీలక అంశాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని బహిరంగంగా డిమాండ్‌ చేస్తోందని విమర్శించారు. అవి దేశ సాధారణ స్వభావాన్ని మారుస్తున్నాయని, ప్రత్యేకతను చాటి చెప్పలేమని అన్నారు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర పోషించని ఆర్‌ఎస్‌ఎస్‌ ”ఆదేశానుసారం” బీజేపీ ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ”దేశ వాస్తవ చరిత్రను విద్యార్థులకు బోధిస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అసౌకర్యంగా భావిస్తాయి. కాబట్టి, దానిని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన స్వాతంత్య్ర పోరాటాన్ని వేరే విధంగా చూపించేలా ప్రయత్నిస్తున్నారు. అండమాన్‌ జైలు నుంచి తనను తాను విడుదల చేసుకోవాలని బ్రిటిష్‌ అధికారులకు క్షమాభిక్ష పిటిషన్లు రాసిన వి.డి. సావర్కర్‌ను ధైర్యవంతుడిగా చిత్రీకరిస్తున్నారు. మహాత్మా గాంధీని వేరే కోణంలో చూపిస్తున్నారు. ఆయనను హత్య చేసిన హంతకుడు నాథూరాం వినాయక్‌ గాడ్సేను కీర్తిస్తున్నారు” అని విజయన్‌ విమర్శించారు. ఇటలీలో బెనిటో ముస్సోలినీ నేతత్వంలోని నేషనల్‌ ఫాసిస్ట్‌ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని, జర్మనీలో అడాల్ఫ్‌ హిట్లర్‌ నేతత్వంలోని నాజీ పార్టీ రాజకీయ ఆదర్శాలను కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.
”ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో చీఫ్‌ ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన పుస్తకం బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌లో క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులను దేశ ప్రధాన అంతర్గత శత్రువులుగా అభివర్ణించారు. ఇది నాజీ పార్టీ యూదులు, బోల్షెవిక్‌లను జర్మనీకి ప్రధాన ముప్పుగా వర్ణించిన దాని నుండి కాపీ చేయబడింది. జర్మనీలో యూదులు మైనారిటీలు, అక్కడి కమ్యూనిస్టులను అప్పట్లో బోల్షెవిక్‌లు అని పిలిచేవారు. ఇది ప్రతిచోటా మైనారిటీల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్ని స్పష్టం చేస్తుంది”అని విజయన్‌ అన్నారు. జర్మనీ అంతర్గత సమస్యలకు పరిష్కారంగా ”హిట్లర్‌ యూదుల మారణహౌమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది” అని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారతదేశ వారసత్వం, లేదా ఇతిహాసాల నుంచి వచ్చినది కాదనీ, హిట్లర్‌ ఆలోచన నుంచి వచ్చిందని పినరయి అన్నారు. జర్మన్‌ హౌలోకాస్ట్‌ నమూనా అనుకరణకు అర్హమైనదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిందని తెలిపారు. జియోనిజం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న ఇష్టం కారణంగానే బీజేపీ ప్రభుత్వం పాలస్తీనాలోని గాజాపై దాడి తరువాత ఇజ్రాయిల్‌కు మద్దతు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌, జియోనిస్టులు కవలలు” అని పినరయి విజయన్‌ విమర్శించారు. భారతదేశ సామ్రాజ్యవాద వ్యతిరేక విదేశాంగ విధానాన్ని నీరుగార్చడంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చూపిన మార్గాన్ని బీజేపీ అనుసరించిందని దుయ్యబట్టారు.
విద్యార్థి శక్తి ముందు సంఘ్‌ పరివార్‌ లొంగిపోవాల్సి వస్తుంది: ఆర్‌ అరుణ్‌కుమార్‌
సంఫ్‌ు పరివార్‌ విధించిన మతతత్వ విధానాలు విద్యార్థి శక్తి ముందు లొంగిపోవాల్సి వస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు ఆర్‌. అరుణ్‌కుమార్‌ అన్నారు. కేరళ ముందుంచుతున్న ప్రత్యామ్నాయాలు దేశానికి మార్గం చూపుతాయని తెలిపారు. పోరాట మార్గంలో సమాన బలంతో మహిళలు కూడా ముందు వరుసలో చేరుతున్నారన్నారు. గుజరాత్‌లో సంఘ్‌ పరివార్‌ను ఓడించి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందిన సత్యేష్‌ లేవా, జేఎన్‌యూలో సంఫ్‌ు పరివార్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతున్న ఐషీ ఘోష్‌ వంటి ఎస్‌ఎఫ్‌ఐ నేతలూ ఈ వరుసలో ఉన్నారన్నారు. అయితే ఇది చిన్నదే అయినా ప్రగతిశీల శక్తులు గుజరాత్‌ చరిత్రలోనే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీకి సవాల్‌ విసురుతున్నాయని తెలిపారు. ఐషీ ఘోష్‌ గురించి చెప్పాలంటే, ఆమె చాలా బలహీనంగా కనిపిస్తోందని, కానీ ఏబీవీపీ గూండాల లాఠీలను ఎదిరించి నిలబడిందని అన్నారు. సమాజ క్షేమానికి మహిళలు ఏం చేయలేరు… వారు బలహీనులు అనే ప్రచారం తప్పని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థినులు స్పష్టం చేశారని అన్నారు. సముద్ర తీరంలో జరిగిన బహిరంగ సభ విద్యార్థుల ప్రవాహంతో జనసముద్రంగా మారింది. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం. సాజి అధ్యక్షత జరిగిన ఈ బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు ఆర్‌. అరుణ్‌ కుమార్‌, వి.పి సాను, మాజీ ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌, సహాయ కార్యదర్శులు ఐషే ఘోష్‌, సత్యేష్‌ లేవా, అమరవీరుడు ధీరజ్‌ తండ్రి రాజేంద్రన్‌ మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన అఖిల భారత ఆఫీస్‌ బేరర్లను బహిరంగ సభకు పరిచయం చేశారు. నూతన ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య సభకు స్వాగతం పలికారు. కేరళ రాష్ట్ర కార్యదర్శి పి. ఎస్‌ సంజీవ్‌ ధన్యవాదాలతో సభ ముగిసింది.

The post ఎన్‌ఈపీ దేశానికే ప్రమాదకరం appeared first on Navatelangana.

​– కేరళలో ఈ విధానాన్ని అమలు చేయం– భవిష్యత్‌ తరాలను తప్పుదోవ పట్టిస్తోంది– ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశానుసారమే దీనిని బీజేపీ అమలు చేస్తోంది – ఆర్‌ఎస్‌ఎస్‌, జియోనిస్టులు కవలలు– ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభ ముగింపు సందర్భంగా: బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌– విద్యార్థి శక్తి ముందు సంఘ్‌ పరివార్‌ లొంగిపోవాల్సిందే : ఆర్‌ అరుణ్‌కుమార్‌కోజికోడ్‌ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిబీజేపీ నేతత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)
The post ఎన్‌ఈపీ దేశానికే ప్రమాదకరం appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *