కాలేయ వైఫల్యం నిర్లక్ష్యం వద్దు

Follow

కాలేయం మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. కాలేయం దెబ్బతిన్న చాలా రోజుల తర్వాత మన శరీరం లక్షణాలను ప్రదర్శిస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే మన జీవితం ప్రమాదంలో పడుతుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నాలుగు సంకేతాలను గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.
1. చర్మం, కండ్లు పచ్చబడటం
కాలేయం దెబ్బతిన్నదనడానికి చర్మం, కండ్లు పచ్చబడటం ఓ సంకేతం. వైద్య పరిభాషలో దీన్ని జాండిస్ (పసరికలు), స్ల్కీరల్ ఇక్టెరస్ అని పిలుస్తారు. ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేయకూడదు. చర్మం, గోళ్లు, కండ్లు పచ్చబడటాన్ని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం కూడదు.
2. పొట్టలో వాపు
పొట్టలో వాపు వచ్చి, అదెంతకూ తగ్గడం లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయడం లేదన్నదానికి గుర్తు. ద్రవాలు పేరుకుపోవడంతో ఇలా జరుగుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు ద్రవాలు పొట్ట, కాళ్లలో పేరుకుపోతుంటాయి
3. వికారం, వాంతులు
ఎలాంటి కారణం లేకుండా వికారం, వాంతికి వచ్చినట్టు అనిపిస్తే కాలేయ సమస్య ఉన్నట్టు. అంతేకాదు, దేన్నీ తినలేకపోతున్నా ముఖ్యంగా మద్యం సేవించిన తర్వాత ఇలా అనిపిస్తే కాలేయం దెబ్బతిన్నది అనడానికి పెద్ద ప్రమాద హెచ్చరిక.
4. పొట్ట కుడి పైభాగంలో నొప్పి
పొట్ట కుడి పైభాగంలో నొప్పిగా ఉండి, ఎంతకూ తగ్గకపోయినా కాలేయ సమస్యకు హెచ్చరికగా భావించాలి. హెపటైటిస్ కారణంగా ఇలా జరుగుతుందని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల మాట. అంటే కాలేయంలో మంటగా ఉంటుంది. ఇదే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్, ఆల్కహాల్ కారణంగా కూడా ఇలా జరుగుతుంటుంది.
తీసుకోకూడని పదార్థాలు
- ఫ్యాటీ లివర్ డిసీజ్‌తోపాటు ఇతర కాలేయ వ్యాధులకు ప్రధాన కారణం ఆల్కహాల్. కాబట్టి, మద్యపానం హానికరం.
- క్యాండీలు, కుకీలు, సోడాలు, పండ్లరసాల్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల, యాడెడ్ షుగర్స్ ఉన్న ఆహారాలను పక్కనపెట్టాలి.
- అధిక కొవ్వులు, క్యాలరీలు ఉండే వేపుళ్లనూ తినకపోవడం మంచిది.
- ప్రాసెస్ చేసిన పిండితో చేసిన పదార్థాలూ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. కాబట్టి, వీటినీ తినకూడదు.
- అధిక శాచురేటెడ్ కొవ్వులు, అధిక సోడియం ఉండే మాంసాహారాలు, బాగా ప్రాసెస్ చేసిన మాంసాన్నీ తీసుకోకపోవడమే మేలు.
కాలేయం మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. కాలేయం దెబ్బతిన్న చాలా రోజుల తర్వాత మన శరీరం లక్షణాలను ప్రదర్శిస్తుంది.