మూల్యాంకనం నిబంధనలను మార్చేశారు.. గ్రూప్ – 1 పరీక్షల నిర్వహణ తీరు పై హైకోర్టులో పిటిషనర్ల వాదన

Follow

- హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం పదే పదే పెంచుతూ పోయారు
- బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదు
- స్టే కొనసాగింపు.. నేడు కూడా విచారణ
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతకవలు జరిగాయంటూ దాఖలైన నాలుగు వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్‌రావు వాదనలు వినిపించారు. పేపర్ల మూల్యాంకన నిబంధనలను టీజీపీఎస్సీ ఇష్టారీతిన మార్చేసిందని, మూల్యాంకనంలో రీకౌంటింగ్ తప్ప రీవాల్యుయేషన్ ఉండదని టీజీపీఎస్సీ నిబంధనల్లో స్పష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. గ్రూప్-1కు మొదట ఒకరితో మూల్యాంకనం చేయిస్తామని, తర్వాత మరొకరు చేస్తారని, ఆ తర్వాత రెండింటి సగటును తీసుకుంటామని టీజీపీఎస్సీ పేర్కొన్నదని తెలిపారు. అవసరమైతే మూడోసారి మూల్యాంకనం చేస్తామని కూడా చెప్పిందన్నారు. దీంతో టీజీపీఎస్సీ తన నిబంధనలను తానే తుంగలో తొక్కిందని అన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు స్పందిస్తూ.. ఒకటికి రెండుసార్లు మూల్యాంకనం చేస్తే నష్టమేమిటని, అది అభ్యర్థుల శ్రేయస్సు కోసమే అవుతుంది కదా అని అన్నారు. దీనికి విద్యాసాగర్ సమాధానం ఇస్తూ స్పష్టమైన నిబంధనలను నోటిఫికేషన్‌లో పొందుపర్చాక వాటిని మార్చాల్సిన అవసరం ఏమిటో టీజీపీఎస్సీ స్పష్టం చేయాలని కోరారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను మార్పు చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు గతంలో తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. మూల్యాంకనం దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులను కూడా నియమిస్తున్నట్టు టీజీపీఎస్సీ పేర్కొన్నదని తెలిపారు. వేరే రాష్ట్రాల వారికి తెలుగు ఎలా తెలుస్తుందన్న కీలక ప్రశ్నకు టీజీపీఎస్సీ నుంచి జవాబు లేదని అన్నారు.
‘బయోమెట్రిక్’పై కోర్టు ఆదేశాలు బేఖాతరు
పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ హాజరును నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసినా టీజీపీఎస్సీ అమలు చేయలేదని న్యాయవాదులు చెప్పారు. ముందుగా 47 పరీక్షా కేంద్రాలకు భదత్ర కావాలన్న టీజీపీఎస్సీ తర్వాత 45 సెంటర్లలకు ఎందుకు తగ్గించిందో స్పష్టం చేయలేదని తెలిపారు. వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఒక పక పరీక్షలు రాసి ఉద్యోగం వస్తుందని కొందరు, మరోపక పరీక్షల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి రద్దు చేయాలంటూ మరికొందరు నిరీక్షిస్తున్నారని అన్నారు. ఇరుపక్షాలు చెప్పిన అంశాల జోలికి వెళ్లకుండా వాదనలు పూర్తిచేయాలని న్యాయవాదులకు సూచించారు. విచారణ మంగళవారం కూడా కొనసాగనున్నది.
పెరుగుతూపోయిన అభ్యర్థుల సంఖ్య
గ్రూప్-1కు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో గందరగోళంతో ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయనే అనుమానాలకు తెరలేచిందని న్యాయవాదులు తెలిపారు. అక్టోబర్ 27న 21,093 మంది పరీక్షకు హాజరయ్యారని, తర్వాత క్రీడల కోటా అభ్యర్థులంటూ మరో 17 మందిని చేర్చి సంఖ్యను 21,110 అని పేర్కొన్నదని చెప్పారు. మూడోసారి సంఖ్యను 21,093 అని, ఆ తర్వాత 21,085 అని మరోసారి టీజీపీఎస్సీ వెల్లడించిందన్నారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలకు బలం చేకూర్చేలా గణాంకాలు ఉన్నాయని దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతకవలు జరిగాయంటూ దాఖలైన నాలుగు వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్‌రావు వాదనలు వినిపించారు. పేపర్ల మూల్యాంకన నిబంధనలను టీజీపీఎస్సీ ఇష్టారీతిన మార్చేసిందని, మూల్యాంకనంలో రీకౌంటింగ్ తప్ప రీవాల్యుయేషన్ ఉండదని టీజీపీఎస్సీ నిబంధనల్లో స్పష్టంగా ఉన్నదని పేర్కొన్నారు.