Bankacherla | ఫలించిన బీఆర్‌ఎస్‌ పోరాటం.. బనకచర్లకు బ్రేకులు..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Banakacherla
  • అనుమతులివ్వలేమన్న పర్యావరణ నిపుణుల కమిటీ
  • ఏపీ టీవోఆర్‌ తిరస్కరణ.. ఫలించిన బీఆర్‌ఎస్‌ పోరాటం
  • ప్రాజెక్టుపై రాష్ర్టాల నుంచి అనేక అభ్యంతరాలు
  • నీటి కేటాయింపులకు విరుద్ధమని ఫిర్యాదులు
  • వరద జలాలపై సమగ్ర అధ్యయనం చేయించాలి
  • ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులు పొందాలి
  • స్పష్టం చేసిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ
  • తాత్కాలికంగా ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు

గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ తలపెట్టిన ‘పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు’కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పర్యావరణ అనుమతులను ఇవ్వలేమంటూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్‌ అప్రయిజల్‌ కమిటీ (ఈఏసీ) తేల్చిచెప్పింది. మొదటి దశ పర్యావరణ అనుమతుల టీవోఆర్‌ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించింది. వరద జలాలపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టంచేసింది. సీడబ్ల్యూసీ నుంచి ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులను పొందిన తర్వాతే ప్రతిపాదనలను పంపాలని తేల్చిచెప్పింది. తాజాగా జరిగిన ఈఏసీ మీటింగ్‌ మినట్స్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఈఏసీ నిర్ణయంతో ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ): గోదావరి-బనకచర్లకు అనుమతి ఇవ్వలేమని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొంటూ, 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ.81వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరడం, అందుకు సానుకూలత వ్యక్తం చేయడమూ తెలిసిందే. ప్రాజెక్టుపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తొలిదశ పర్యావరణ అనుమతుల ‘టీవోఆర్‌ (టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌)’ కోసం కేంద్ర అటవీ,  పర్యావరణమంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు సమర్పించిది. రివర్‌ వ్యాలీ, హైడ్రోఎలక్ట్రికల్‌ ప్రాజెక్టు ఎక్స్‌పర్ట్‌ అప్రయిజల్‌ కమిటీ (ఈఏసీ) జూన్‌ 17న ఢిల్లీలో భేటీ అయ్యింది. ఏపీ ప్రతిపాదనలపై చర్చించింది. టీవోఆర్‌ జారీకి నిరాకరించింది.

వరదజలాలపై సమగ్ర అధ్యయనం అవసరం

ఈఏసీ సభ్యులు పీబీ లింక్‌ ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలను సంధించారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణతోపాటు, పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీలు, 400 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని ఏపీ చేసిన ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టులో ముంపు సంబంధిత అంశాలపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఆ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నదనే విషయాన్ని ఈఏసీ గుర్తించింది. ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఈమెయిల్స్‌ సహా వివిధ మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను కూడా ఈఏసీ పరిగణనలోకి తీసుకున్నది.

గోదావరి బేసిన్‌లో పోలవరం డ్యామ్‌ నుంచి వరద నీటిని ఏపీ రాష్ట్రంలోని నీటి లోటు బేసిన్‌లకు మళ్లించడం ప్రతిపాదిత పథకం లక్ష్యమని, ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదించి గోదావరిలో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని ఈఏసీ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ అవార్డు 1980ని ఉల్లంఘించేలా ఉన్నదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కాబట్టి ముందుగా సీడబ్ల్యూసీని సంప్రదించాలని, అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుని, అవసరమైన అనుమతులను తీసుకోవాలని ఈఏసీ సూచించింది. ఆ తర్వాతే పర్యావరణ ప్రభావ అంచనా టీవోఆర్‌ కోసం ప్రతిపాదనలను పంపించాలని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తిరిస్కరిస్తున్నట్టు ఈఏసీ మినట్స్‌లో స్పష్టం చేసింది. దీంతో ఏపీ దూకుడుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్లయింది.

అడుగడుగునా నిలదీసిన బీఆర్‌ఎస్‌

పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును ఏపీ తెరమీదకు తెచ్చిన క్షణం నుంచి అడుగడుగునా బీఆర్‌ఎస్‌ పార్టీ నిలదీస్తూనే ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నది. ఏపీ ప్రభుత్వం పేరుకే 200 టీఎంసీలు అని చెబుతున్నా ఏకంగా 400టీఎంసీల తరలింపునకు అనుగుణంగా ప్రతిపాదనలు చేస్తున్నదని, ప్రాజెక్టు ద్వారా తెలంగాణ జలహక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతుందని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. బనకచర్ల ప్రాజెక్టుతో వాటిల్లే నష్టాన్ని ఎలుగెత్తి చాటింది. మరోవైపు కేసీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్‌రావు ఇటీవల తెలంగాణభవన్‌ వేదికగా కాంగ్రెస్‌ను నిలదీశారు.

ఏపీ పీబీలింక్‌పై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వడంతోపాటు, రాష్ట్రానికివాటిల్లే ముప్పుపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్‌ సర్కారు ఉదాసీన వైఖరిని ఎండగట్టారు. ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ జలహక్కుల కోసం బీఆర్‌ఎస్‌ ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటిస్తుందని, ప్రజా పోరాటానికి, గోదావరి పరీవాహక ప్రాంతల రైతుల తరఫున సుప్రీంకోర్టుకైనా వెళ్తామని హెచ్చరించారు. అప్పటికిగానీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కదలిక రాలేదు. వెంటనే నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అవార్డులకు విరుద్ధంగా, బేసిన్‌ రాష్ర్టాల అంగీకారం లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ పర్యావరణ అనుమతులను ఇవ్వకూడదని కేంద్ర మంత్రిని కోరారు.

ఏపీ ప్రతిపాదనను వెనకి పంపుతూ ఈఏసీ చేసిన సిఫారసులు
1) వరద జలాల లభ్యతపై కేంద్ర
జల సంఘం (సీడబ్ల్యూసీ) సమగ్ర అధ్యయనం చేయాలి.
2) 1980 గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు
(తీర్పు)కు విరుద్ధంగా ప్రాజెక్టు ఉన్నదన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
3) అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా తయారీకి ముందు రాష్ట్రాల మధ్య
నీటి పంపిణీపై స్పష్టత కోసం కేంద్ర జల సంఘం అనుమతి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

​Bankacherla : గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ తలపెట్టిన ‘పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు’కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పర్యావరణ అనుమతులను ఇవ్వలేమంటూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్‌ అప్రయిజల్‌ కమిటీ (ఈఏసీ) తేల్చిచెప్పింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *