CM Revanth | ‘సిగాచీ’ పేలుడు మృతులకు రూ.కోటి పరిహారం : సీఎం రేవంత్‌రెడ్డి

Follow

హైదరాబాద్ : సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదన్నారు. మంగళవారం ప్రమాద స్థలిని పరిశీలించి, అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది ఉన్నారని, వారిలో 57 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపినట్లు సీఎం చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున మంత్రులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించనున్నారని చెప్పారు.
తీవ్రంగా గాయపడి తిరిగి పనులు చేయలేని స్థితిలో ఉన్న బాధితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించినట్లు సీఎం తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు. మృతుల్లో తమిళనాడు, బీహార్, జార్ఖండ్ వాసులు అధికంగా ఉన్నారని వెల్లడించారు. మృతదేహాలను స్వస్థలాల తరలించడంలో ప్రభుత్వం సాయపడుతుందన్నారు.
మృతుల పిల్లల చదువులకు ప్రభుత్వం సాయం చేయనుందని సీఎం చెప్పారు. యాజమాన్యాలు ఇకనైనా కార్మికులు, ఉద్యోగుల భద్రతపై ఫోకస్ చేయాలన్నారు. ప్రమాదాలను నివారించాలని, ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఘటనపై ప్రభుత్వం తరఫున దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం తెలిపారు.
CM Revanth | సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదన్నారు.