Gossip Garage: వరంగల్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. గ్రూప్‌లుగా విడిపోయి రచ్చకెక్కిన ఎమ్మెల్యేలు..

Follow

Gossip Garage: వాళ్లంటే వీళ్లకు గిట్టదు. వీళ్లు అంటే వాళ్లకు నచ్చదు. పార్టీలో ఉంటే వాళ్లుండాలి. లేకపోతే మేముండాలి అంటున్నారు. ఓరగల్లు కాంగ్రెస్‌లో ఇదే రచ్చ నడుస్తోంది. నువ్వానేనా అంటూ కారాలు, మిరియాలు నూరుకుంటూ..గ్రూపులుగా విడిపోయి బాహాబాహికి దిగుతున్నారు నేతలు. విభేదాలు పీక్ లెవల్‌కు చేరడంతో పాటు.. బండబూతులు తిట్టుకుని..ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో రచ్చ చేస్తున్నారు. అన్నిచోట్ల రెండు గ్రూపులుంటే..వరంగల్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట కొనసాగుతోందా.? నేతల గ్రూప్ వార్‌కు ఎండ్ కార్డ్ పడేదెప్పుడు.?
వరంగల్ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ రచ్చకెక్కి..డ్యాన్స్ చేస్తోంది. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న విబేధాలు..కొండా మురళి కామెంట్స్‌తో మరింత హీటెక్కాయి. దీంతో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి మిగతా ఎమ్మెల్యేలతో కలిసి..కొండా దంపతులపై ఫిర్యాదు చేశారు. కౌంటర్‌గా కడియం, రేవూరి తీరుపై కొండా మురళి లిఖితపూర్వక కంప్లైంట్ ఇచ్చారు.
ఈ రాద్దాంతం ఇలా కొనసాగుతుండగానే..ఓరుగల్లు కాంగ్రెస్‌లో కల్లోలంపై జిల్లాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. రెండు పార్లమెంట్ స్థానాలను కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొందింది.
కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వచ్చాక..ఆయన కూతురు కావ్య వరంగల్ నుంచి ఎంపీగా గెలుపొందిన తర్వాత ఓరుగల్లు కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు పీక్ లెవల్‌కు చేరుకున్నాయన్న టాక్ ఉంది. మంత్రి కొండా సురేఖకు జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియంతో పాటు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణతో విభేదాలు తలెత్తాయి. దీంతో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారింది. ఇంతలో మంత్రి సురేఖ ఆమె భర్త కొండా మురళి చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఆధిపత్య పోరుతో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేలు పార్టీకి ఫిర్యాదులు చేశారు. అయినా తగ్గేదేలే అంటున్నారు కొండా దంపతులు.
వరంగల్ కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు రచ్చకెక్కి నీవా-నేనా అన్నట్లుగా గొడవపడుతుంటే..మిగతా ఎమ్మెల్యేలు, మంత్రి సీతక్క మరో గ్రూప్‌గా మారారట. ఉమ్మడి జిల్లా పాలిటిక్స్‌లో మంత్రి సీతక్క ఏ మాత్రం తనకు పట్టనట్లుగా దూరంగా ఉంటున్నారు. కేవలం తన నియోజకవర్గం ములుగుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు.. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తలో దారిలో వెళ్తున్నారు.
దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశానికి సీఎం వస్తే కూడా ఆ మీటింగ్‌కు దొంతి డుమ్మా కొట్టారు. ఇక డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ గ్రూపులకు అతీతంగా దూరంగా ఉంటున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా కొంత వరకు కొండా దంపతులకు అనుకూలంగా ఉన్నట్లు టాక్. ఎర్రబెల్లితో కొండా దంపతులకు వైరం ఉండటం..ఎర్రబెల్లి..రాజకీయంగా యశస్వినికి ప్రత్యర్థి కావడంతో ఆమె కొండా దంపతులవైపే ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అయినా ఏ వర్గానికి బహిరంగంగా మద్దతు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు యశస్విని రెడ్డి.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు. పార్టీ నేతల మధ్య వివాదాలను సద్దుమణిచేలా చేసి..ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఓరుగల్లు గ్రూప్ పాలిటిక్స్‌కు ఎండ్ కార్డ్ పడేదెప్పుడో చూడాలి.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.