Heavy Rains: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. ఆ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన

Follow

Heavy Rains: ఉత్తరభారతంలో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటితోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్ కు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.
Also Read: బాబోయ్.. చూస్తుండగానే పేక ముక్కలా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్
తెలంగాణలో..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్ సహా.. కుమ్రంభీం, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జయశంకర్, సిద్దిపేట, వరంగల్, ములుగు, జనగాం, ఖమ్మం, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ (మంగళవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో..
బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. మిగతాజిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.