KTR: రేవంత్ సర్కార్‌పై విచారణకు ఎందుకు ఆదేశించరు, ఒక్క పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు?- అమిత్ షాపై కేటీఆర్ ప్రశ్నల వర్షం

Follow

KTR : నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను ఏటీఎంలా వాడుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఉద్దేశించి అమిత్ షా చేసిన విమర్శలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షాకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా? అని కేటీఆర్ అడిగారు.
కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో.. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ జరపడానికి కేంద్రానికి ఏం అడ్డు వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించగలరా అని ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్టుగా సాగుతున్న కుమ్మక్కు రాజకీయాల వల్లే రేవంత్ ను వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలకు సమాధానం ఉందా అని నిలదీశారు.
Also Read: ఒక్కొక్కరికి లక్ష రూపాయలు.. మెడికోలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా స్టైఫండ్ పెంపు..
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని అమిత్ షాను అడిగారు కేటీఆర్. మరోవైపు.. ధాన్యం దిగుబడిలో పంజాబ్ నే తలదన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లడం అత్యంత దురదృష్టకరం అని వాపోయారు.
గతంలో దేశ ప్రధాని మోదీ వచ్చినప్పుడు, ఏకంగా రాహుల్-రేవంత్ కలిసి ఆర్.ఆర్. టాక్స్ పేరిట దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కానీ దర్యాప్తునకు మాత్రం నేటికీ ఆదేశించలేదు. దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి హోదాలో మీరు తెలంగాణకు వచ్చి కేవలం సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? పట్టపగలు ప్రజాధనం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న కాంగ్రెస్ సీఎం అక్రమాలకు కేంద్ర అడ్డుకట్ట వేయలేదా? 8 మంది ఎంపీలను గెలిపించినా, ఇద్దరు కేంద్రమంత్రులున్నా, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి ఉన్నత విద్యాసంస్థలు మంజూరు చేయకుండా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని 4 కోట్ల మంది ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా.. పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనమేంటి? కనీసం సొంత భవనం కూడా కట్టకుండా.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా? అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా? ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించేశారు. మరోసారి మీరు ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటి?
ఏపీలోని TDP ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు నదుల అనుసంధానం ముసుగులో కేంద్రం బంగారు బాటలు వేయడం.. గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడం కాదా? విభజన చట్టం ప్రకారం అడవి బిడ్డలకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు కర్మాగారానికి పాతరేసి, హైదరాబాద్ రూపురేఖలు మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా రద్దు చేయడం తెలంగాణ ప్రజలకు కేంద్రం చేసిన ద్రోహం కాదా? పేరుకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నా, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకే అప్పగించే ప్రయత్నాలకు స్వస్తి పలికి వరంగల్ యువత ఉపాధికి భరోసా ఇవ్వగలరా? కేంద్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదు. రాలేదు” అని కేటీఆర్ తేల్చి చెప్పారు.
గౌరవ అమిత్ షా గారు..
తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..?
కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో.. అవినీతి…
— KTR (@KTRBRS) June 29, 2025
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని అమిత్ షాను అడిగారు కేటీఆర్.