Pashamylaram | పెనువిషాదం.. రియాక్టర్ పేలుడుతో 12 మంది దుర్మరణం.. కుప్పకూలిన మూడంతస్థుల భవనం

Follow

పాశమైలారంలో పెనువిషాదం
పేలిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్
12 మంది దుర్మరణం
మరో 34 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమం
సిగాచి ఫ్యాక్టరీలో విస్ఫోటం.. ఎగిసిపడిన మంటలు
పేలుడుతో కుప్పకూలిన మూడంతస్థుల భవనం
ఎగిసిపడిన మంటల్లో పలువురు సజీవ దహనం
ప్రధాని మోదీ, కేసీఆర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి
పరారీలో యాజమాన్యం.. స్థానికుల ఆందోళన
సహాయ చర్యలు చేపట్టడంలో సర్కారు విఫలం
రూ. కోటి చొప్పున పరిహారమివ్వాలి: హరీశ్‌రావు
ప్రమాదంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం
సంగారెడ్డి జూన్ 30 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించి 12 మంది కార్మికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి వంద మీటర్ల మేర మంటలు ఎగిసి పడగా, మూడు అంతస్థుల భవనం కుప్పకూలి మృ తుల సంఖ్య పెరిగింది. 12 మందిలో కేవలం ముగ్గురినే గుర్తించారు. 10 మంది ఘటనా స్థలంలోనే చనిపోగా ఇద్దరు దవాఖానలో మృతిచెందారు. మృతుల్లో జగన్మోహన్, నాగజిత్, శశిభూషణ్‌ను గుర్తించగా మిగతా వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తున్నది. శిథిలాల నుంచి వెలికితీసిన 12 మంది మృతదేహాలను పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ 34 మందిని ధ్రువ, ప్రణామమ్, కాకతీయ, పటాన్చెరు ప్రభుత్వ దవాఖానతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కాగా శిథిలాల కింద చాలా మంది చిక్కుకోగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. పరిశ్రమలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డ మంటలు
సిగాచి పరిశ్రమలో ఉదయం 9.18 గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 100 మీటర్ల ఎత్తుకు మంటలు ఎగిసిపడ్డాయి. రెండు కిలోమీటర్ల దాకా పేలుడు శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భూకంపం వచ్చిందేమోనని పాశమైలారం గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్‌ను తయారు చేస్తుంది. కాగా సోమవారం ఉదయం షిఫ్ట్‌కు కంపెనీలోకి 118 మంది కార్మికులు డ్యూటీకి వచ్చారు. వీరితోపాటు అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది 32 మంది, సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు డ్యూటీలో ఉన్నారు. అందరూ విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. కంపెనీలో రియాక్టర్లు పేలడంతో వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలున్నాయి. రియాక్టర్ల పేలుడు ధాటికి కంపెనీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు పక్కనే ఉన్న మూడంతస్థుల అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలింది.

మంటలు చెలరేగటంతో కంపెనీ నలువైపులా పొగ కమ్ముకున్నది. చాలాsaమంది కార్మికులు మంటల్లో చిక్కుకుపోయి, భవనం శిథిలాల కింద పడి చనిపోయారు. కొందరు పరుగులు తీసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అడ్మినిస్ట్రేషన్ భవనంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు చనిపోయినట్టు తెలుస్తున్నది. ఘటనా స్థలానికి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఫైరింజన్లను రప్పించడంతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను రప్పించారు. ఎన్న్డీఆర్ఎఫ్ బృందాలు గ్యాస్ కట్టర్లను, ఇతర పరికరాలను ఉపయోగించి శిథిలాల కింద ఉన్న 10 మంది మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికితీశాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి 10 గంటల వరకు మొత్తం 16 మృతదేహాలను వెలికితీసినట్టు తెలిసినా అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పరిశీలించిన మంత్రులు
ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ సందర్శించారు. ప్రమాదం గురించి కలెక్టర్‌ను, ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దామోదర మాట్లాడుతూ ప్రమాదం జరగటం బాధాకరమని వాపోయారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. వివేక్ మాట్లాడుతూ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతామని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడే చెప్పలేమని, బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా పరిశ్రమలో ప్రమాదం జరిగి 12 మంది మృతిచెందినా యాజమాన్యం, ప్రతినిధుల జాడ కనిపించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. యాజమాన్యం తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నేడు సీఎం రాక
సిగాచి పరిశ్రమను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రులు శ్రీధర్‌బాబు, జిల్లా మంత్రి దామోదర, ఇన్చార్జి మంత్రి వివేక్‌తో కలిసి ఘటనా స్థలం వద్దకు రానున్నట్టు తెలిసింది.
పేలింది రియాక్టరా? ఎయిర్ డ్రయ్యరా?
సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి రియాక్టర్ పేలుడే కారణమని కంపెనీ కార్మికులు, ఇతర సిబ్బంది చెప్తుండగా అధికారులు ధ్రువీకరించలేదు. కంపెనీలో రియాక్టర్ పేలలేదని, ఎయిర్ డ్రయ్యర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు చెప్తున్నారు. కంపెనీ తయారు చేసే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ తయారీకి ఉడ్పల్ప్, హెచ్‌సీఎల్ పౌడర్ ఇతర రసాయనాలను వాడుతారు. వాటిని ఎయిర్ డ్రయ్యర్లో కలుపుతున్న క్రమంలో పేలుడు సంభవించినట్టు పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఉడ్ పల్ప్, హెచ్‌సీఎల్‌తో పేలుడు సంభవిస్తుందని, ఈ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంటున్నారు. కాగా తీవ్రతను చూస్తుంటే రియాక్టర్లు పేలి ఉంటాయని కంపెనీని సందర్శించిన కార్మిక సంఘం నాయకులు చెప్తున్నారు.
ప్లాంట్ మేనేజర్ మృతి
పేలుడు ఘటనలో ప్లాంటు మేనేజర్ ఎల్ఎన్ గోవన్ మృతిచెందారు. ఆయన ఈ కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. నాలుగు నెలలుగా విధులకు దూరంగా ఉన్న గోవన్ 2 రోజుల నుంచే వస్తున్నారు. కంపెనీకి వచ్చి వాహనం దిగి అడ్మినిస్ట్రేషన్ భవనంలోకి వెళ్తుండగానే పేలుడు సంభవించి దూరాన ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇవి కూడా చదవండి
- గ్రేటర్లో వర్షం
- MLC Kodandaram | భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాం
- Wimbledon | గ్రాండ్‌స్లామ్‌లో సంచలనం.. టైటిల్ ఫేవరెట్‌కు షాకిచ్చిన 64వ ర్యాంకర్
- Shefali Jariwala | నటి షెఫాలీ జరీవాలా మృతిపై కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు.. ఆ మాత్రలు అలా వేసుకోవడం వల్లే..!
Pashamylaram : సంగారెడ్డి జూన్ 30 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించి 12 మంది కార్మికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు.