Raavi Srinivas: నేను ఏం తప్పు చేశానో మంత్రి సీతక్క చెప్పాలి, త్వరలో పార్టీ పరిస్థితి అందరికీ తెలుస్తుంది- రావి శ్రీనివాస్

Follow

Raavi Srinivas: కాగజ్‌నగర్ లో కాంగ్రెస్ నుండి సస్పెన్షన్ కు గురైన రావి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మరోసారి మంత్రి సీతక్కపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి సీతక్క ప్రోద్బలంతోనే తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని రావి శ్రీనివాస్ ఆరోపించారు. నేను ఏం తప్పు చేశానో మంత్రి సీతక్క బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎందరో ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు, నన్ను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారని రావి శ్రీనివాస్ ప్రశ్నించారు. మంత్రి సీతక్కను మా ఆడపడుచుగా ఆదరించాం, కానీ ఆమె మమ్మల్ని ఇబ్బందులు పెట్టిందని వాపోయారు.
తన సస్పెన్షన్ వెనుక మంత్రి సీతక్కతో పాటు సత్తు మల్లేష్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, ఎమ్మెల్సీ దండే విఠల్ హస్తం, ఒత్తిడి ఉన్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం ఓటమికి సీతక్కే కారణం అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బదులిస్తామన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే పార్టీ నుండి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు రావి శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు నివేదికలు ఇచ్చి పార్టీలో క్యాడర్ ను ఇబ్బందులు పెడుతున్నారని రావి శ్రీనివాస్ వాపోయారు. ములుగుతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి అందరికీ తెలుస్తుందన్నారు.
రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. రావి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కపై విమర్శలు చేశారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.
Also Read: రియాక్టర్ పేలుడు ఘటన.. 13కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 12 మంది పరిస్థితి విషమం
దీనిపై స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణ చర్య కమిటీ(డీఏసీ) ఛైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో పార్టీ నియమావళిని అనుసరించి చర్యలుంటాయని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రావి శ్రీనివాస్ నుంచి సరైన వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు నివేదికలు ఇచ్చి పార్టీలో క్యాడర్ ను ఇబ్బందులు పెడుతున్నారని రావి శ్రీనివాస్ వాపోయారు.