Sangareddy: పాశమైలారం ఘటనలో 37కు చేరిన మృతులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఘటనాస్థలికి సీఎం రేవంత్ రెడ్డి..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Chemical Plant

Sangareddy Chemical Plant Explosion: హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషద పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన‌లో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 37మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

పరిశ్రమ ప్రమాద వివరాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వెల్లడించారు. ప్రస్తుతం 35మంది చికిత్స పొందుతున్నారని, 27మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదని చెప్పారు. 57మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని, జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీసు బృందాలు సంఘటితంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 మందిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సిగాచి ఫార్మాస్కూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్‌ను తయారు చేస్తుంది. సోమవారం ఉదయం షిప్టుకు కంపెనీలోకి 118 మంది కార్మికులు డ్యూటీకి వచ్చారు. వీరితోపాటు.. అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది 32 మంది, సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు డ్యూటీలో ఉన్నారు. అందరూ విధుల్లో ఉండగా భారీ విస్ఫోటనం జరిగింది. కంపెనీలో రియాక్టర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి.

ప్రమాద సమయంలో మూడు అంస్తుల భవనం కూలిపోవడం వల్ల శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇదిలాఉంటే.. ప్రమాదంలో ఇప్పటి వరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతి చెందారు. గుర్తుపట్టలేని స్థితిలో 20మృతదేహాలు ఉన్నాయి. సంబంధిత అధికారుల సమక్షంలో రక్త నమూనాలు ఇవ్వాలని, డీఎన్ఏ పరీక్షలకు సహకరించాలని బాధిత కుటుంబాలను అధికారులు కోరారు.

నేడు ఘటనాస్థలికి సీఎం రేవంత్ రెడ్డి..
పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పరిశ్రమ వద్ద చేపట్టిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు అక్కడున్న మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గడ్డం వివేక్ లను అడిగి తెలుసుకోవడంతోపాటు సీఎస్, డీజీపీలతో సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ ఉదయం 10గంటలకు రేవంత్ రెడ్డి పాశమైలారంలో ప్రమాదం జరిగిన పరిశ్రమ వద్దకు వెళ్లనున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

​పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషద పరిశ్రమలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *