Scrapage policy: పాత వాహనాల స్క్రాపింగ్ కు కొత్త టెక్నాలజీ.. సుమారు గంటలోనే పని పూర్తి

Follow

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 13న స్వచ్ఛంద వాహన – విమాన ఆధునీకరణ కార్యక్రమాన్ని (వీవీఎంపీ) ప్రారంభించారు. కాలుష్య కారక వాహనాలను పర్యావరణ అనుకూల పద్దతిలో తుక్కు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే వాహన వాయు కాలుష్యాన్ని తగ్గించడం, రహదారి భద్రతను పెంచడం, ఇంధన సామర్థ్యం ఎక్కువ చేయడానికి కూడా దోహదపడుతుంది. దీనిలో భాగంగా అనధికారికంగా జరుగుతున్న స్క్రాపింగ్ రంగాన్ని ఆధునీకరించాలని భావించారు. కొత్త పద్ధతులు, విధానాల ద్వారా తక్కువ సమయంలో కాలుష్య రహితంగా స్క్రాపింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు.
కొత్త విధానంలో హర్యానా రాష్ట్రంలోని మనేసర్ సమీపంలో ఉన్న అభిషేక్ కెకైహూ రీస్లైక్లర్స్ ప్రేవేటు లిమిటెడ్ ఆవిర్భవించింది. ప్రభుత్వ కొత్త ఫ్రేమ్ వర్క్ కింద ఆ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన మొట్టమొదటి రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్ వీఎస్ఎఫ్) అని చెప్పవచ్చు. కాలుష్య సమస్యల కారణంగా సుమారు 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
అభిషేక్ కెకైహూ స్క్రాపింగ్ కేంద్రంలో ఏటా సుమారు 24 వేల నుంచి 25 వేల వరకూ కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చుతున్నారు. దీని కోసం జపనీస్ కంపెనీ సహకారం తీసుకున్నారు. ఇక్కడ అన్ని రకాల ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, బస్సులు, లారీలు, ట్రక్కులను పర్యావరణ హితంగా స్క్రాప్ చేస్తున్నారు. ముందుగా ఆ వాహనంలోని ఇనుము, అల్యూమినియం భాగాలను వేరు చేస్తారు. మిగిలిన బాడీని కటింగ్ కోసం పంపుతారు. ఈ పనికి గ్యాస్ కట్టర్లకు బదులుగా ప్లాస్మా కట్టర్లు వాడతారు. కట్ చేసిన బాడీని బేలింగ్ మెషీన్ లో ప్రాసెస్ చేస్తారు. దీనితో కొత్త వాహన భాగాలను తయారు చేయడానికి ఫర్నేసుల్లో ఉపయోగించవచ్చు.
కేవలం 80 నిమిషాల నుంచి 100 నిమిషాల్లోపు వాహనం స్క్రాపింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జపనీస్ టెక్నాలజీ మెషీన్లతో చాలా త్వరగా జరుగుతుంది. వాహనం స్క్రాపింగ్ అనంతరం సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. దీని ద్వారా మరో కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ పన్నుపై రాయితీ, డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 99 రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకూ సుమారు 1.18 లక్షల ప్రభుత్వ వాహనాలు, 1.27 లక్షల ప్రైవేటు వాహనాలున స్క్రాప్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మన దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల వినియోగం ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను వినియోగిస్తున్నారు. అలాగే బస్సులు, లారీలు కూడా పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలకు సేవలందిస్తున్నప్పటికీ సుమారు 15 ఏళ్లుగా దాటితే స్క్రాపింగ్ (తుక్కు)కు పంపేయ్యాలి. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దానికి గల కారణాల్లో కాలం చెల్లిన వాహనాల నుంచి విడుదలయ్యే పొగ ఒకటి. వాటిని రోడ్ల మీదకు రాకుండా చేయడం వల్ల గాలిని పరిశుభ్రంగా ఉంచవచ్చు. ఈ నేపథ్యంలో వాహనాలను స్క్రాపింగ్ చేసే కేంద్రాలు క్రమంగా పెరుగుతున్నాయి. వాటిలో ఆధునిక పద్ధతులు పాటించి కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చుతున్నారు. హర్యానాలో ఏర్పాటు చేసిన అలాంటి కేంద్రం నుంచి ఇప్పుడు తెలుసుకుందాం.