Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Top Headlines 5 Pm 23th June 2025

తిరుమలలో నగదు రహిత లావాదేవీలు.. టీటీడీ మరో ముందడుగు..
తిరుమలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది. మరో వైపు అదనపు లడ్డూ నియంత్రణపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు వసతిగదుల కేటాయింపులో పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీల విధానాన్ని అమలు చేస్తోంది టీటీడీ.. మరోవైపు డొనేషన్స్‌ స్వీకరణలో నగదు రహిత లావాదేవీలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.. తాజాగా, శ్రీవారి ప్రసాదాల విక్రయంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. దీని కోసం లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ఏర్పాటు చేసింది టీటీడీ.. ఇప్పటి వరకు నగదు చెల్లించి.. అదనపు లడ్డూలు సైతం పొందే అవకాశం ఉండగా.. ఇప్పుడు కియోస్కి మెషిన్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగిస్తోంది.. లడ్డూ కౌంటర్ల దగ్గర ఐదు కియోస్కి మెషిన్లు ఏర్పాటు చేసిన టీటీడీ.. ఎంబీసీ కార్యాలయం దగ్గర మరో మూడు మెషిన్లు పెట్టింది.. దీని ద్వారా క్యాష్‌ లెస్‌ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది.. కాగా, దర్శన టికెట్‌ ఉన్న భక్తులు కోరినన్ని లడ్డూలు పొందే అవకాశం ఉండగా.. దర్శన టికెట్‌ లేని భక్తులు ఆధార్‌ కార్డు ద్వారా రెండు లడ్డూలు పొందే సౌలభ్యం ఉన్న విషయం విదితమే.. అయితే, నగదు రహిత సేవల కోసం ఏర్పాటు చేసిన కియోస్కి మెషన్ల విధానం విజయవంతం అయితే.. మరికొన్ని చోట్ల కూడా ఇవి ఏర్పాటు చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది..

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్‌ కుట్ర..!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్‌ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా.. రప్పా.. తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండిం కుండా పుష్పా సినిమా డైలాగులు అని వెటకారంగా చెప్పడం తగదని హితవు పలికారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, పెట్టుబడులు తీసుకురాని వైఎస్‌ జగన్.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడిదారులను ఉద్దేశ పూర్వకంగా భయపెట్టాలని పర్యాటనల పేరుతో బలప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుదని ఆయన హెచ్చరించారు. జగన్ తన వాహనం కిందపడి నలిగిపోతున్న సింగయ్య అనే కార్యకర్తను పట్టించుకోకుండా వాహనం ముందుకు పోనిచ్చారంటే అతనికి మానవత్వం లేదని అర్థమవుతుందని మండిపడ్డారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.

నిత్య పెళ్లి కూతురు..! ఇప్పటికే 12 పెళ్లిళ్లు.. ఆమె టార్గెట్‌ వాళ్లే..
నిత్య పెళ్లి కొడుకుల వ్యవహారాలు వెలుగు చూసేవి.. ఇప్పుడు కాలం మారిపోయింది.. నిత్య పెళ్లి కూతుళ్లు కూడా చెలరేగిపోతున్నారు.. ఓవైపు ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే స్కెచ్‌ వేసి మరి కాటికి పంపుతుండగా.. ఇప్పుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు.. అయితే, ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరిని పడితే.. వారిని పెళ్లి చేసుకోదండోయ్‌.. ఆమె, టార్గెట్‌ అంతా వేరు.. ఆమె వెనుక ఓ గ్యాంగ్‌ కూడా ఉందంటే నమ్మండి.. ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తుందట.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ… ఇక, నీలిమకు ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్‌ అనే ముగ్గురు వ్యక్తుల సహకారం ఉందట.. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుని.. వారికి మాయ మాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ.. కొంత సమయం తీసుకుని.. ఆ తర్వాత తన కన్నింగ్‌ ఐడియాను అమలు చేస్తోంది.. వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది.. తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది.. ఏదైనా గుట్టుగా చేద్దామనుకుంటే ఎక్కువ కాలం సాగదు కదా..? నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు.. తమకు జరిగిన అన్యాయాన్ని.. ఎలా మోస పోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు..

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? చంద్రబాబుకు జగన్‌ ఛాలెంజ్..
వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన రాజకీయంగా కాక రేపుతోంది.. జగన్‌ పర్యటనలో ఇద్దరు చనిపోవడం.. అందులో ఓ వ్యక్తి జగన్‌ ప్రయాణిస్తున్న కారు కిందే పడినట్టు వీడియోలు వెలుగు చూడడం.. జగన్‌పై కేసులు నమోదు చేయడం.. ఇలా పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. ఈ తరుణంలో.. చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ.. సవాల్‌ విసిరారు జగన్‌.. చంద్రబాబు గారు.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఛాలెంజ్‌ విసిరారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్..

కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమచేస్తోంది. రైతులకు డబ్బులు అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేపు రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా?.. రూ. 15 వేలు ఇస్తానని చెప్పి రూ. 12 వేలు ఇస్తున్నందుకు సంబరాలు చేయాలా..? రైతు భీమా, రుణ మాఫీ, పంటల బీమా చేయనందుకా, సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా అని ప్రశ్నించారు. లగచర్ల, ధన్వాడ రైతులకు బేడీలు వేసి జైలుకు పంపినందుకు సంబరాలు చేయాలా.. రైతులకు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నందుకు సంబరాలు చేయాలా.. ఇదేనా రైతులపై సీఎం రేవంత్ కి ఉన్న ప్రేమ..?.. మీకు నిజాయితీ ఉంటే ఎగ్గొట్టిన రైతు భరోసా ఇచ్చి సంబరాలు చేయండి.. కేసీఆర్ 11 సార్లు రైతు బంధు ఇస్తే ఎలాంటి ఉత్సవాలు చేయలేదు.. కేసీఆర్ నాట్లకు నాట్లకు రైతు బంధు వేస్తే ఓట్లకు ఓట్లకు రేవంత్ రైతు భరోసా ఇస్తున్నాడు.. ఈ రోజు గాంధీ భవన్ లో గొర్రెలు తీసుకుపోయి యాదవులు తమ నిరసన వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు స్థానిక సంస్థల ఎన్నిల విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషన్ వాదనలు పూర్తయ్యాయి. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. పదవీకాలం ముగిశాక ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధనను గుర్తు చేశారు పిటిషనర్లు. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్ లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును రిజర్వ్ చేసింది. కాగా 2024 ఫిబ్రవరి 1 న తెలంగాణ సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది.

కొత్త మలుపు.. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్
ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) రఘునందన్ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితో పాటు, DOT (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్) అనుమతీ తప్పనిసరి. ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్ల జాబితాను రివ్యూ కమిటీ పరిశీలించి, అనుమతిని కేంద్రానికి పంపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రభాకర్ రావు నేతృత్వంలోని SIB విభాగం సుమారు 618 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ కోసం రివ్యూ కమిటీకి సమర్పించింది. అప్పట్లో సీఎస్‌గా ఉన్న శాంతి కుమారి DOTకి ఆ లిస్ట్ పంపి టెలికం అనుమతులు తీసుకున్నట్లు SIT దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అదే కేసులో అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్ మరియు ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్‌లకు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేయగా, తాజాగా శాంతి కుమారి, రఘునందన్ రావులను స్వయంగా విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కేసు మరింత లోతుగా సాగుతున్న దశలో, ఈ రెండు స్టేట్‌మెంట్లు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమానుషం.. నీట్ మాక్ టెస్ట్‌లో ఫెయిలైందని కర్రతో దాడి.. కుమార్తె మృతి
మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్ మాక్ టెస్ట్‌లో కుమార్తెకు తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. విచక్షణ మరిచి చెక్క కర్రతో చితకబాదాడు. అనంతరం పట్టించుకోకపోవడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్ కావల్సిన కుమార్తె.. శవమైంది. ఈ విషాద ఘటన సాంగ్లి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ధోండిరామ్ భోసలే అనే వ్యక్తి మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. అతడి కుమార్తె(17) 12వ తరగతి చదువుతోంది. ఇంకోవైపు నీట్ కోచింగ్ తీసుకుంటోంది. అయితే కుమార్తెకు నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంలో కుమార్తెను చెక్క కర్రతో నిర్దాక్షిణ్యంగా చితకబాదాడు. అనంతరం కుమార్తెను పట్టించుకోకుండా పాఠశాలలో జరుగుతున్న యోగా దినోత్సవ వేడుకలకు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చేసరికి కుమార్తె ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతికి కారణమైన తండ్రి, ప్రిన్సిపాల్ ధోండిరామ్ భోసలేను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ఇరాన్‌లో భారత ఇంజనీర్ అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఆందోళన
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ప్రవేశించింది. దీంతో ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో ఇరు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు చెందిన ఒక ఇంజనీర్‌ ఇరాన్‌లో అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. తమకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంది. బీహార్‌కు చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ.. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడితో పాటు మరికొంత మంది ఇరాన్‌లో ఒక ప్లాంట్ నిర్మాణం కోసం పని చేస్తున్నారు. జూన్ 9న సౌదీ అరేబియా మీదుగా సిరాజ్ ఇరాన్ చేరుకున్నాడు. ఇంతలోనే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే సిరాజ్ పని చేస్తున్న ప్రాంతంలో క్షిపణి దాడులు జరిగాయి. అక్కడ వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. జూన్ 17న సిరాజ్‌తో కుటుంబ సభ్యులు చివరి సారిగా ఫోన్‌లో మాట్లాడారు. అప్పటి నుంచి సిరాజ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై ఇరాన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని వేడుకున్నారు.

ఏడుస్తూ కూర్చోలేము కదా?.. ముందుకు సాగిపోవావాల్సిందే!
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. టీమిండియా ఫీల్డర్లు పలు కీలక క్యాచ్‌లు డ్రాప్‌ చేశారు. ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పలు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మ్యాచ్ మూడో రోజైన ఆదివారం టీ విరామం వరకు ఆరు క్యాచ్‌లను మనోళ్లు వదిలేశారు. ఫీల్డింగ్ పరంగా గత ఐదేళ్లలో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పాలి. ప్రస్తుతం టీమ్ మొత్తం యువ ఆటగాళ్లతో ఉందని, ఇలా క్యాచ్‌లను డ్రాప్ చేయడం ఏంటని అందరూ మండిపడుతున్నారు. దీనిపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. క్యాచ్‌లను ఎవరూ కావాలని డ్రాప్ చేయరని, అంతా జరిగాక ఏడుస్తూ కూర్చోలేము కదా? అని బదులిచ్చాడు.

బ్రాహ్మిణ్ పాత్రతో కాశీ ‘కబేళా’లో రేప్ చేయిస్తారా?
మలయాళ భామ అనంతిక హీరోయిన్ గా 8 వసంతాలు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది, అయితే ఈ సినిమాలో హీరోయిన్ తో ఒక ఫైట్ ప్లాన్ చేశారు అది కూడా కాశీ కబేళాలో ప్లాన్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఈ విషయాన్ని నేరుగా ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో టీంను ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. నిజానికి ఈ సినిమాకి మిక్స్ రివ్యూస్ వచ్చాయి కొంతమంది బాగుందంటే కొంతమంది మాత్రం అసలు ఏమాత్రం బాలేదని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించడంతో సీనియర్ జర్నలిస్టు ఒకరు క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ లో భాగంగా తనకు ఈ సినిమాలో అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడించారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడి పాత్రతో అమ్మాయిని రేప్ చేయించే ప్రయత్నం చేయడం అది కూడా ఒక కబేళాలో చేయించడం ఆ ఆలోచన అభ్యంతరకరమని అన్నారు.

డ్రగ్స్ కేసులో ‘ఒకరికి ఒకరు’ హీరో శ్రీరామ్ అరెస్ట్
కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో ఇరుకున్నాడు. ఏపీలోని  తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలని చిన్నప్పుడే చెన్నై వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకుని చిన్న చిన్నపాత్రల్లో నటిస్తూ రోజా పూలు సినిమాతో  హీరోగా తెలుగు, తమిళ లో ఎంట్రీ‌‌‌‌ ఇచ్చాడు. ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళ,కన్నడలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు శ్రీరామ్. ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ లోను అలరించాడు. ఇదిలా ఉండగా ఈ సీనియర్ నటుడిని డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడు శ్రీరామ్ కు  వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల సేకరించారు. అనంతరం నుంగంబాక్కం స్టేషన్‌కు శ్రీరామ్ ను తరలించి సుమారు  రెండు గంటలుగా విచారిస్తున్నారు చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ యూనిట్ పోలీసులు. మాజీ AIADMK కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుండి  డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేసారు. ఇప్పటికే ఈ  డ్రగ్స్ కేసులో అన్నా డీఎంకే  కార్యనిర్వాహకుడు ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలిసులు. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన స్నేహితులు సినిమాలో జీవాతో పాటు కలిసి నటించాడు శ్రీరామ్. శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

​Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 5 PM 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *