Yashasvi Jaiswal : మనసు మార్చుకున్న యశస్వి జైస్వాల్.. ఇక ముంబైకే..

Follow

టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన మనసును మార్చుకున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరుపుననే ఆడనున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గోవా తరుపున ఆడాలని భావించిన యశస్వి జైస్వాల్ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఎంసీఏ కూడా అతడికి ఎన్ఓసీని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడా ఎన్ఓసీని రద్దు చేయాలని ఎంసీఏను జైస్వాల్ కోరాడు. ఇందుకు ఎంసీఏ కూడా సానుకూలంగా స్పందించింది.
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజిక్య నాయక్ ఈ విషయం గురించి మాట్లాడాడు. యశస్వి జైస్వాల్‌కు గతంలో జారీ చేసిన ఎన్ఓసీ రద్దు చేసినట్లు తెలిపాడు. అతడి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపాడు. రానున్న సీజన్ నుంచి అతడు ముంబై తరుపుననే ఆడనున్నట్లు చెప్పాడు.
తన కుటుంబం గోవాలో స్థిరపడాలనుకున్న ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకుందని, అందుకునే ఎన్ఓసీని రద్దు చేయాలని జైస్వాల్ ఎంసీఏకి రాసిన లేఖలో తెలిపాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్ఓసీని ఇప్పటి వరకు గోవా క్రికెట్ అసోసియేషన్‌కు గానీ, బీసీసీఐగానీ సమర్పించలేదని ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ స్పష్టం చేశాడు.
2019లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుండి యశస్వి జైస్వాల్ ముంబై తరపున నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 60.85 సగటుతో 3,712 పరుగులు సాధించాడు.
ప్రస్తుతం జైస్వాల్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. జూలై 2 నుంచి భారత్,ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన మనసును మార్చుకున్నాడు.